Begin typing your search above and press return to search.

అయ్యయ్యో.. క్రికెటర్లకు ఎన్ని కష్టాలొచ్చే..ఐపీఎల్ కు హోటళ్లు కాదని.. రిసార్టులు.. క్వారంటైన్లు

By:  Tupaki Desk   |   6 Aug 2020 7:50 AM GMT
అయ్యయ్యో.. క్రికెటర్లకు ఎన్ని కష్టాలొచ్చే..ఐపీఎల్ కు   హోటళ్లు కాదని.. రిసార్టులు.. క్వారంటైన్లు
X
అసలు క్రికెటర్ల లైపే వేరు. ఒక్కసారి అంతర్జాతీయ జట్టుకు ఎంపికై.. నాలుగైదు మ్యాచ్ లను గెలిపిస్తే చాలు ఇక రేంజే మారిపోతుంది. ఇక బీసీసీఐ వంటి బోర్డులు ఆటగాళ్లకు కల్పించే వసతులు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. వాళ్ళ కోసం నక్షత్రాల స్టార్ హోటల్స్, ఒక్కొక్కరికి ఖరీదైన గదులు, కోరుకునే ఫుడ్, జిమ్ ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలానే ఉంది. ప్రస్తుతం కరోనాతో అవన్నీ దూరం అవనున్నాయి. కోవిడ్ మొదలైనప్పటి నుంచి దేశంలో అసలు క్రికెట్ మ్యాచ్ లు జరగడం లేదు. ఎలాగోలా యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఈ సీజన్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు 52 రోజులపాటు ఐపీఎల్ నిర్వహించనున్నారు. ఆగస్టు 20వ తేదీ తర్వాత ఐపీఎల్ లో పాల్గొనే 8 జట్లు యూఏఈ కి వెళ్లనున్నాయి. ఆటగాళ్లు అక్కడికి చేరుకునేలోగా వాళ్లకు కల్పించాల్సిన వసతులపై యాజమాన్యాలు దృష్టి పెట్టాయి. కరోనా నేపథ్యంలో అప్పటిలా స్టార్ హోటళ్లలో ప్రత్యేక గదులు, ఇతర వసతులు కల్పించడానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. క్రికెటర్లు కూడా స్టార్ హోటల్లో బస చేసేందుకు జంకుతున్నారు. ఎయిర్ కండిషన్ డక్టుల ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని భయపడుతున్నారు. దీంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రిసార్టులు గానీ, అపార్ట్మెంట్లు గానీ బుక్ చేయాలని చూస్తున్నాయి. సన్ రైజర్స్ జట్టు తమ ఆటగాళ్ల కోసం దుబాయిలో రిసార్టు బుక్ చేయాలని చూస్తుండగా, ముంబై ఇండియన్స్ జట్టు అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని అందులో ఆటగాళ్లకు ఒక్కొక్క గదిని కేటాయించాలని అనుకుంటోంది. ఇక ఆటగాళ్లు ఆరు రోజులపాటు క్వారంటైన్ లో ఉంటూ ఐదు సార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఆటగాళ్లు కోరుకునే వంటలు వారి మెనూలో ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది చేతులు మారకుండా ఉండే ఫుడ్ పెడితే చాలని కోరుకుంటున్నారు. మ్యాచుల సమయంలో సకల సౌకర్యాలు అనుభవించే క్రికెటర్లు, ఇప్పుడు క్వారంటైన్ కేంద్రాలు ప్రత్యేక రిసార్టుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.