ప్రియుడికోసం పోరుగు రాష్ట్రంలో.. స్మగ్లర్ గా మారిన తెలుగు అమ్మాయి!

Thu Jun 17 2021 08:00:01 GMT+0530 (IST)

girl who became a smuggler

చదువుకోవాలని పొరుగు రాష్ట్రం పంపిస్తే.. ప్రేమలో పడింది. అతనితో పెళ్లి వద్దన్నందుకు ఇంట్లో గొడవ పెట్టుకొని వెళ్లిపోయింది. అప్పటికే సవాలక్ష చెడు అలవాట్లున్న ప్రియుడు గంజాయి స్మగ్లర్ కూడా! మన జీవితం దెబ్బకు సెట్ అయిపోతుంది గంజాయి అమ్ముదాం అని చెప్పాడు. దీనికి సరే అన్న యువతి.. గంజాయి స్మగ్లర్ గా మారిపోయింది. సీన్ కట్ చేస్తే.. జైల్లో చిప్పకూడు తింటోంది!ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువతి చెన్నైలో ఇంజనీరింగ్ చదివింది. అదే కాలేజీలో చదువుతున్న బెంగళూరు యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్తా ప్రేమకు దారితీసింది. చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. అయినప్పటికీ.. తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో.. తల్లిదండ్రులు వదిలేశారు.

ఇంట్లోంచి వెళ్లి ప్రియుడిని కలిసింది. ఇద్దరూ బెంగళూరులో ఒక రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు. కొంత కాలం గడిచిన తర్వాత పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడిగితే.. జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత అన్నాడు. సెటిల్ కావడమంటే.. డబ్బు సంపాదించడమే కదా అని దానికి ఒక మార్గం చెప్పాడు. తాను గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాని ఇది చేస్తే ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పి అమ్మాయిని కూడా రంగంలోకి దించాడు.

ఇలా చేయడం నేరం అని తెలిసి కూడా గంజాయి స్మగ్లింగ్ చేయడానికి అంగీకరించిందా యువతి. అయితే.. గంజాయి స్మగ్లింగ్ లో ఆరితేరిన అతగాడు.. ప్రియురాలిని వాడుకోవడం మొదలు పెట్టాడు. డెలివరీ ఇవ్వడానికి ప్రతిసారీ ఈ అమ్మాయినే పంపించేవాడు. పోలీసులకు పట్టుబడకుండా ఇలా వ్యవహరించాడు. చివరకు ఆ రోజు రానే వచ్చింది. పోలీసులకు ఈ యువతి దొరికింది. ఆమె నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని జైలుకు తరలించారు. తనకేమీ తెలియదని ప్రియుడు చెబితేనే ఇదంతా చేశానని చెప్పినా.. ఉపయోగం లేకపోయింది. ఇంజనీర్ కావాల్సిన యువతి.. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటోంది.