తెలంగాణ ఇప్పించిన పార్టీ ఇప్పటికే పోతే.. ఇచ్చిన పార్టీ సైతం పోయినట్లే

Thu Nov 19 2020 11:45:12 GMT+0530 (IST)

ghmc elections 2020 date Released

గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తున్న వారికి ఒక విషయం ఇట్టే అర్థమైపోతుంది. మొన్నటివరకు టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అన్నంతనే కాంగ్రెస్ మాట వినిపించేది. ఇప్పుడు అది కాస్త గతంగా చెప్పాలి. గడిచిన కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉంటే.. వారి స్థానాన్నికైవశం చేసుకోవటానికి బీజేపీ నేతలు దూకుడుగా వ్యవహరించటమే కాదు.. ఇప్పుడు గులాబీ నేతలు సైతం తమ పోరు మొత్తం కమలనాథుల మీదనే అన్నమాటను చెప్పేస్తున్నారు.ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన మాటల్లో ప్రస్తావిస్తున్నారు. కేంద్రం మీద యుద్దమే అన్న ఘాటు వ్యాఖ్య చేయటం చూస్తే.. బీజేపీ ఆయన్ను ఎంతలా ఇబ్బంది పెడుతుందో ఇట్టే అర్థమైపోతుంది. తనకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నంత కాలం మౌనంగా ఉండే కేసీఆర్.. ఏ మాత్రం తేడా వచ్చినా..ఆయన మాటల తీరు ఎలా మారుతుందో తెలంగాణ ప్రజలకే కాదు.. తెలుగు ప్రజలకు సుపరిచితమే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూస్తే.. ఒక ఆసక్తికర అంశం ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం రావటానికి కారణమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి ఔట్ అయిందన్న విషయం తెలిసిందే. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని చెప్పక తప్పదు.

ఇదంతా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన రెండు పార్టీలు.. రాష్ట్ర రాజకీయాల్లో తమ బలాన్ని పూర్తిగా పోగొట్టుకోవటమే కాదు.. తమ ఉనికిని సైతం ప్రశ్నార్థకంగా మారటం ఆసక్తికరమని చెప్పక తప్పదు. రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన రెండు పార్టీల స్థానే.. తెలంగాణ వచ్చేలా చేయటంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. బీజేపీలు రెండు ఆప్పుడు తమ అధిక్యతను ప్రదర్శించుకోవటానికి ఢీ అంటే ఢీ అనటం కనిపిస్తుంది.