Begin typing your search above and press return to search.

ఆ ఊర్లో పాలు ఫ్రీ.. అమ్మారంటే కష్టాలు తప్పవు

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:30 AM GMT
ఆ ఊర్లో పాలు ఫ్రీ..  అమ్మారంటే కష్టాలు తప్పవు
X
ఆ రెండు గ్రామాల్లో ఎవరూ పాలు అమ్మడానికి వీల్లేదు. ఎన్ని పాలైనా ఉచితంగా పోయాల్సిందే. పొరపాటున ఎవరైనా పాలు అమ్మారో వారికి కష్టాలు తప్పవు. ఎన్నో ఏండ్లుగా ఇలాగే జరుగుతున్నది. కొంతమంది ఆయా గ్రామాల్లో అనాదిగా వస్తున్న ఆచారాన్ని విస్మరించి పాలు అమ్మారు. ఫలితం తీవ్ర కష్టాలపాలయ్యారు. అందుకే ఆ గ్రామంలో పాలు అమ్మవద్దని గ్రామస్థలు స్వీయ నిషేధం విధించుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా గంజహళ్లి, కడిమెట్ల గ్రామాల్లో కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

ఎందుకీ నిషేధం..
గంజహళ్లిలో 400కు పైగానే పశువులున్నాయి. ప్రతి రోజూ ఐదారు వందల లీటర్ల పాలు ఇస్తాయి. కానీ ఏ రోజూ వారు పాలను అమ్మరు. అవసరమైన మేరకు ఇంట్లో వాడుకుంటారు.. ఎక్కువయితే అడిగిన వారికి ఉచితంగా పోస్తారు. గంజహళ్లితో పాటు పక్కనే ఉనన కడిమెట్ల గ్రామంలోనూ ఇదే ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామాల్లోని హోటల్​ యజమానులు కూడా పక్క గ్రామాలకు వెళ్లి పాలు కొనుగోలు చేస్తుంటారు. సుమారు 400 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందట.

తమ గ్రామాల్లో పాలు అమ్మకపోవడానికి కారణం గ్రామానికి చెందిన బడేసాబ్‌ తాతే కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. గంజహళ్లి జనం భక్తితో పిలుచుకునే తాత పేరు సద్గురు బడేసాహెబ్‌. ఆయన 1667 సంవత్సరంలో సజీవ సమాధి అయ్యారు. 400 ఏళ్ల క్రితం గంజహళ్లి గ్రామంలో పాడి పశువులకు అంతుచిక్కని వ్యాధి సోకిందట. వందల పశువులు చనిపోయాయట. అయితే గ్రామంలో ఉండే బడేసాబ్‌ తాతకు ఓరోజు పాలు తాగాలనిపించి తన కొడుకు హుస్సేన్‌ సాహెబ్‌ ను పాలు తీసుకురమ్మని ఊరిలోకి పంపించాడట. పశువులన్నింటికి జబ్బు చేయడంతో ఏ ఒక్కరూ పాలు పోయలేదట. చివరకు గ్రామ పెద్దయిన పెద్ద నాగిరెడ్డి ఇంటి కి వెళ్లగా తమ గోవు తీవ్రమైన వ్యాధి తో ప్రాణం వదిలిందని, ఊరి చివరనున్న మారెమ్మ ఆలయం వద్ద ఆ కళేబరాన్ని పడేశామని చెప్పాడట.

అయితే పాలు కచ్చితం గా తీసుకెళ్లాలని హుస్సేన్‌సాహెబ్‌ మారెమ్మవ్వ గుడి వద్దకు వెళ్ళాడట. పాలు తీసుకెళ్ళకపోతే తండ్రి కోప్పడతాడని హుస్సేన్‌ సాహెబ్‌ మారెమ్మను ప్రార్థించాడట. అతడి ప్రార్థనకు ప్రసన్నురాలైన ఆ తల్లి ‘మీ తండ్రి నామాన్ని ఉచ్చరిస్తూ ఆవును లేపు’ అని చెప్పిందట. మారెమ్మవ్వ దేవత చెప్పిన ప్రకారమే తనతండ్రి పేరును ఉచ్చరిస్తూ.. ‘బాబా బోలీ దూద్‌ దేవ్‌’ అన్నాడట. ఆ మాటలకు ఆవు లేచి హుస్సేన్‌సాహెబ్‌కు పాలు ఇచ్చిందట. ఇప్పటికీ ఈ కథను ఊళ్లలో చెప్పుకుంటూ ఉంటారు. ఆ వింతను చూసిన జనం పశువులు చనిపోకుండా మార్గం చూపండని బడేసాబ్‌ను అడగగా ఇకపై గ్రామస్తులెవరూ ఊళ్లో పాలు అమ్మరాదని, పశువులను చంపకూడదని, పశుగ్రాసాన్ని తగుల బెట్టకూడదని సూచించారట. ఈ కట్టుబాటుకు లోబడి ఉండాలని ఊరి జనంతో మాట కూడా తీసుకున్నారట.

మరో గ్రామామైన కడిమెట్ల.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ కూడా ఇదే ఆచారం కొనసాగుతున్నది. గ్రామస్థుల ఆరాధ్య ధైవమైన చెన్నకేశవస్వామి పూర్వ కాలంలో యాదవ కులస్థులకు పెట్టిన శాపం ఫలితమని కొందరు అంటారు. కొందరు పెద్దలు మాత్రం పెద్దలు పెట్టిన కట్టుబాటును కొనసాగిస్తున్నామని అంటారు.