Begin typing your search above and press return to search.

నిజామా‘బాధ’: కేసీఆర్ కు పట్టదు.. అరవింద్ కు నిలదీతలు

By:  Tupaki Desk   |   23 Jan 2021 3:30 PM GMT
నిజామా‘బాధ’: కేసీఆర్ కు పట్టదు.. అరవింద్ కు నిలదీతలు
X
సార్వత్రిక ఎన్నికల వేళ అరచేతిలో స్వర్గం చూపిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు ఇప్పుడు పూలు చల్లిన ఆ పసుపు రైతులే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాడు ఎన్నో అలివికానీ హామీలు గుప్పించిన అరవింద్ ను ఇప్పుడు అవి తీర్చాలని అదే రైతులు నిలదీస్తున్న దైన్యం నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కూతురు కవితను ఓడించడంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు దొరికిన ప్రధాన ఆయుధం పసుపుబోర్డు, ఎర్రజొన్నలకు మద్దతు ధర. అయితే తనను గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాని.. పసుపుకు మద్దతు ధర కల్పిస్తానన్న అరవింద్ మాట తప్పడంతో ఇప్పుడు నిలదీతలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

నిజామాబాద్ పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. పసుపు మద్దతు ధర కోసం చేసిన ప్రయత్నాలను ఎంపీ అరవింద్ వివరించగా.. రైతులు ఆయనను అడ్డుకున్నారు.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని.. మద్దతు ధర దక్కలేదని.. ఇన్నాళ్లుగా ఏం చేశావని రైతులు నిలదీశారు. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదిరోజుల్లో ఎంపీ వైఖరి తెలుపాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో అరవింద్ రైతులకు సర్ధిచెప్పారు. 'చేసిన పనులు చెప్పానని.. నిర్ణయం మీదేనంటూ' అక్కడి నుంచి జారుకున్నారు.

నిజామాబాద్ రైతులు అరవింద్ మాటను నమ్మి గెలిపించి ఇప్పుడు నిండా మునిగారు. ఆయన కేంద్రం నుంచి పసుపు బోర్డు, మద్దతు ధర తేలేకపోతున్నారన్న విమర్శలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.. ఇటు సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించడంతో కేసీఆర్, కేటీఆర్ నిజామాబాద్ ముఖం చూడడం లేదు. దీంతో అభివృద్ధి జిల్లాలో పడకేసింది.

కవిత ఓటమితో నిజామాబాద్ పార్లమెంట్ లో అభివృద్ధి పడకేసిందని.. ఇక్కడి ప్రజలు ఘోరమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. బీజేపీ ఎంపీని గెలిపించి అభివృద్ధిని దూరం చేసుకున్నారని ఆడిపోసుకున్నారు. అన్నట్టే నిజామాబాద్ ను అటు కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కవిత కూడా అక్కడ అడుగు పెట్టడం లేదు. ఒక్క మంత్రి కూడా ఆ జిల్లాకు పోవడం లేదు. అభివృద్ధి పనులు సాగడం లేదట..

తన కూతురు కవితను ఓడించిన నిజామాబాద్ ప్రజలపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట.. అందుకే వచ్చే ఎన్నికల్లో కవితను నిజామాబాద్ లో పోటీచేయించవద్దని నిర్ణయించినట్లు సమాచారం. తన కూతురును ఓడించిన నిజామాబాద్ ప్రజలకు నేతలకు బుద్దివచ్చేలా ఏ నిధులు ఇవ్వడం లేదనే ప్రచారం సాగుతోంది. మద్దతు ధరను పట్టించుకోవడం లేదట.. దీంతో ప్రజలు సహజంగానే గెలిపించిన అరవింద్ ను నిలదీస్తున్నారు.

ఇలా అరవింద్ మాటలను నమ్మిన పసుపు రైతులు ఇప్పుడు గొడవ చేస్తే ఏం లాభం అన్న చర్చ ఆ జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ అన్నట్టు గడ్డి దున్నపోతుకు వేసి.. పాలు బర్రెకు పితికితే వస్తుందా అన్న సామెతను నిజామాబాద్ జిల్లాలో రైతులు, నేతలు గుర్తు చేసుకుంటున్నారట.. అయితే ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులన్నట్టు రాజకీయం ఎటు వైపు మరులుతుందనేది వేచిచూడాల్సిందే.