కేసీఆర్ కు భారీ సవాల్ విసరనున్న ఈటల?

Mon May 03 2021 11:00:01 GMT+0530 (IST)

etela throw a big challenge to KCR?

ప్రజాదరణ ఉన్న నాయకుడిగా.. ఉద్యమ నేపథ్యంతో పాటు.. పదునైన తన మాటలతో ప్రత్యర్థులను సైతం ఇరుకున పెట్టే సత్తా ఉన్న ఈటల.. గడిచిన మూడు రోజులుగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భూకబ్జా ఆరోపణలు.. అంతలోనే మంత్రిత్వ శాఖ నుంచి పక్కకు పెట్టిన సీఎం కేసీఆర్ రోజు గడిచేసరికి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం సంచలనంగా మారింది.వరుస పెట్టి తనకు షాకిస్తున్న కేసీఆర్ పైన ఈటెల ఇప్పటివరకు ఎలాంటి ఘాటు వ్యాఖ్య చేసింది లేదు. ఆచితూచి అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైనే కేసీఆర్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన ఈటలకు సార్ తత్త్వం బాగా తెలుసని చెబుతారు. అదే సమయంలో ఈటల ఎప్పుడెలా స్పందిస్తారో కేసీఆర్ కు ఒక అంచనా ఉండటం ఖాయం. ఈ కారణంతోనే.. తన బాస్ కు అర్థం కాని రీతిలో ఎత్తులు వేసేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తనను పార్టీ నుంచి గెంటేసే వరకు వెయిట్ చేయటం కానీ.. లేదంటే తానే పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఈటల ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎలా అయితే.. ఉప ఎన్నికలతో తెలంగాణ సాధనకు రోడ్ మ్యాప్ వేశారో.. అదే రీతిలో తనను అవమానించిన గులాబీ బాస్ కు ఉప ఎన్నిక జరిగేందుకు వీలుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెబుతున్నారు.

అదే జరిగితే.. నిబంధనల ప్రకారం ఆర్నెల్ల లోపు ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా తన బలాన్ని ప్రదర్శించటమే కాదు.. అధినేత మీద ఘాటు విమర్శలు చేస్తారంటున్నారు.  తెలంగాణలో వ్యక్తిగతంగా తనకున్న సత్తా ఏమిటో ఉప ఎన్నిక ద్వారా చాటాలన్నదే ఈటల ఆలోచనగా  చెబుతున్నారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవటం ద్వారా భారీ సవాల్ విసిరేలా ఆయన ఆలోచనలు ఉన్నాయంటున్నారు.  ఏమైనా.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.  తన శిష్యుడి ఎత్తులకు కేసీఆర్ ఎలాంటి పైఎత్తులు వేస్తారో చూడాలి.