జోబిడెన్ ఎందుకు అమెరికా అధ్యక్షుడయ్యాడో చెప్పిన ఎలన్ మస్క్

Fri May 13 2022 17:04:26 GMT+0530 (IST)

elon musk explains why Jobiden became President of the US

అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ గెలుపును ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ కాస్త పరిహాసం చేసినట్టే ఆయన తాజా ట్వీట్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఓవరాక్షన్ ఎక్కువ అవ్వడం వల్లే జనాలు సైలెన్స్ కోరుకునేందుకు జోబిడెన్ ను గెలిపించారని మస్క్ మాటలను బట్టి తెలుస్తోంది. ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.జోబిడెన్ ఎందుకు అమెరికా అధ్యక్షుడు అయ్యాడో  ప్రముఖ బిలియనీర్ టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ వివరించాడు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జోబిడెన్ చేసిన తప్పు ఏంటంటే.. దేశాన్ని మార్చడానికే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని భావించడం.. కానీ నిజానికి అందరు తక్కువ నాటకీయతను కోరుకున్నారు. అందుకే జోబిడెన్ అధ్యక్షుడయ్యాడు’ అని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

అధ్యక్ష రేసులో జోబిడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ లో విధించిన నిషేధాన్ని ఎత్తేస్తానని దాని కొత్త బాస్ ఎలన్ మస్క్ ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే ఎలన్ మస్క్ మద్దతు ట్రంప్ కే ఉందని.. తాజాగా వ్యాఖ్యలతో జోబిడెన్ గెలుపును మస్క్ పరిహాసం చేసినట్టుగా తెలుస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అధ్యక్ష పీఠాన్ని వదలకుండా తన మద్దతుదారులను ఎగదోస్తూ అమెరికా పార్లమెంట్ పైనే దాడికి ఉసిగొల్పిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలు షాక్ ఇచ్చాయి. ట్రంప్ ఉద్రేకాలు రెచ్చగొడుతుండడంతో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్  గతంలో షాక్ ఇచ్చింది.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్ వల్ల భవిష్యత్తులోనూ హింసాత్మక ఘటనల ముప్పు పొంచి ఉందని పేర్కొంది.

ఈ నిర్ణయంతో ఇక ట్రంప్  ట్విట్టర్ లో ట్వీట్లు చేయలేకపోయాడు. తన వాయిస్ ను వినిపించలేదు. అమెరికాలో అధ్యక్ష మార్పిడి జరిగే లోపు అటు ఫేస్ బుక్ ఇటు ట్విట్టర్ కూడా నిషేధం విధించడంతో ఆయన గొంతు మూగబోయినట్టైంది.

దీంతో ఆయనే సొంతంగా ‘ట్రూత్ సోషల్’అనే సోషల్ మీడియాను స్థాపించారు. అందులోనే కొనసాగుతున్నాడు. ఇటీవల ట్విట్టర్ ను కొన్న ఎలన్ మస్క్ తిరిగి ట్రంప్ ఖాతాను పునరుద్దరిస్తామని చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం తాను ట్విట్టర్ లోకి రాలేనని సున్నితంగా తిరస్కరించారు. ఈ క్రమంలోనే జోబిడెన్ సైలెన్స్ వల్లే అమెరికా అధ్యక్షుడయ్యాని ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.