Begin typing your search above and press return to search.

కారు అమ్మేస్తా అంటే ప్రభుత్వం దిగొచ్చింది

By:  Tupaki Desk   |   12 July 2020 12:30 PM GMT
కారు అమ్మేస్తా అంటే ప్రభుత్వం దిగొచ్చింది
X
ద్యుతి చంద్. పుట్టింది, పెరిగింది ఒరిస్సాలోనే అయినా... అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాక ఆమె చాలా ఏళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడే కోచ్ నాగపురి రమేశ్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా స్ప్రింటర్ ఆమె. ఈ అథ్లెట్ జీవితంలో వివాదాలకు కొదవేమీ లేదు. తరచుగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇంతకుముందు ద్యుతిలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలతో కొంత కాలం నిషేధం పడింది. దీనిపై స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుల్లో పోరాడి గెలిచింది ద్యుతి. ఆ సంగతలా ఉంచితే.. తాను స్వలింగ సంపర్కురాలినని.. ఓ అమ్మాయితో సహ జీవనం చేస్తున్నానని గత ఏడాది ప్రకటించి సంచలనం రేపింది ద్యుతి. ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ధైర్యంగా ఈ విషయం చెప్పినందుకు ఆమెనందరూ అభినందించారు.

ఇక తాజాగా ద్యుతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. లాక్ డౌన్ టైంలో శిక్షణ కోసం చాలా కష్టపడుతున్నానని.. తనకు ఎవరూ ఏ రకంగానూ సాయం చేయట్లేదని ఆమె చెప్పింది. గతంలో ఓ పతకం గెలిచినందుకు హైదరాబాద్ ప్రముఖుడు చాముండీశ్వరీనాథ్.. ద్యుతికి బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వగా.. దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడం కోసం కోచ్, ఫిజియో, డైటీషియన్లకు జీతాలివ్వడానికి, ఇతర ఖర్చులకు తనకు నెలకు లక్షల్లో ఖర్చవుతోందని.. కరోనా సమయంలో స్పాన్సర్లందరూ వెనక్కి వెళ్లిపోయారని.. ప్రభుత్వ అధికారులను అడిగితే వాళ్లు కూడా చేతులెత్తేశారని.. దీంతో తన కారును అమ్మకానికి పెట్టానని.. ఆ కారు మెయింటైనెన్స్ కూడా తన వల్ల కావట్లేదని ఆమె చెప్పింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒరిస్పా ప్రభుత్వం అప్రమత్తం అయింది. దేశంలోనే అగ్రశ్రేణి అథ్లెట్లలో ఒకరైన తమ క్రీడాకారిణిని ఆదుకోకుంటే పరువు పోతుందని భావించి ఆమెకు ఆర్థిక సాయం అందించడానికి సరేనంది. దీంతో ద్యుతి ఆ పోస్టును తొలగించేసింది.