వైసీపీలో ఇదో అసంతృప్తి.. అంతకుమించి.. ఏంటంటే...!

Mon Apr 19 2021 08:00:02 GMT+0530 (IST)

dissatisfaction in the YSRCP

ఏపీ అధికార పార్టీ వైసీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డవారికి.. జగన్ కోసం.. జగన్‌ను సీఎంగా చూడాలని అనుకున్నవారికంటే.. ఆయనను గతంలో తిట్టిపోసిన వారికి జగన్ ఇప్పుడు అందలాలు అప్పగించారనే విమర్శలు సొంతపార్టీలో నే వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్.. సొంతగా పార్టీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై సీబీఐ ఈడీ కేసులు నమోదయ్యాయి. అయితే.. వీటి వెనుక అప్పటి యూపీఏ-2 చైర్ పర్సన్ సోనియా గాంధీ టీడీపీ రెండూ ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో అనేక మంది నాయకులు అటు అసెంబ్లీలోను ఇటు.. బయట కూడా జగన్‌ను   ఏకేశారు.ఇక ఇదే సమయంలో జగన్ జైల్లో ఉన్నప్పటికీ.. పార్టీనే ముఖ్యమని భావించిన వారు చాలా మంది పార్టీ జెండా పట్టుకుని ప్రజల మధ్య తిరిగి.. జగన్‌పై సానుభూతి పెరిగేలా చేశారు. వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే.. వీరిని కాదని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో తనను విమర్శించిన వారిని చేరదీయడం ప్రారంభించారు జగన్. వీరిలో చాలా మందికి కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు కూడా. ఈ  జాబితాలో కురసాల కన్నబాబు బొత్స సత్యనారాయణ తానేటి వనిత శ్రీరంగనాథరాజు వెలంపల్లి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ ఆదిమూలపు సురేష్ వంటివారు  ఉన్నారు.

అయితే.. వీరికే జగన్ ప్రాధాన్యం ఇవ్వడం.. జగన్‌ను నమ్ముకున్న.. పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కన పెట్టడం వంటివి ఇప్పుడు విమర్శలకు దారితీస్తుండడం గమనార్హం. మరి ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు కూడా కొనసాగితే.. పార్టీ పరిస్థితి కష్టమే అని అంటున్నారు నాయకులు. మరి ఇప్పటికైనా జగన్.. ఎవరు తనకు గతంలో అండగా ఉన్నారు..?  ఎవరు వచ్చే సంవత్సరాల్లో తనకు అనుకూలంగా రాజకీయం చేస్తారు? ఎవరు అవకాశవాదంగా వ్యవహరిస్తారు? అనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు. మరి జగన్ గుర్తిస్తారా?  ప్రస్తుతం వెనుకబడిన నాయకులకు.. గుర్తింపు ఇస్తారా ? అనేది వేచి చూడాల్సి ఉంది.