Begin typing your search above and press return to search.

అత్తాకోడళ్ల చపాతీ గొడవ.. మధ్యలో దూరిన భర్తపై కేసు

By:  Tupaki Desk   |   3 Jun 2022 12:30 AM GMT
అత్తాకోడళ్ల చపాతీ గొడవ.. మధ్యలో దూరిన భర్తపై కేసు
X
ఇద్దరు ఆడవాళ్ళ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మగాళ్లు చూస్తూ సైలెంట్గా ఉండాలే తప్ప మధ్యలో కలగజేసుకోకూడదు. అలా చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలో అస్సలు దూరకూడదు. కానీ ఓ వ్యక్తి తన తల్లికి, భార్యకు జరుగుతున్న గొడవ లో దూరాడు. దూరడమే కాకుండా భార్య పై చేయి చేసుకున్నాడు. ఇక అంతే సంగతులు.. తనకు సపోర్ట్ చేయకపోగా.. తనపై చేయి చేసుకోవడంతో భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు అత్తాకోడళ్ల మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే..?

పురాతన కాలం నుంచి అత్తా కోడళ్లు అంటే నిప్పు ఉప్పు లాగే ఉంటున్నారు. కాలం మారుతోంది. పద్ధతులూ మారుతున్నాయి. వాటితో పాటు కొందరు అత్తలు కూడా మారుతున్నారు. తమకెలాగు అత్త పోరు తప్పదనుకున్న వాళ్లు.. తమ కోడళ్లైనా సుఖంగా ఉండాలని కోరుకుంటూ వాళ్లతో స్నేహంగా ఉంటున్నారు. మరికొందరేమో.. తాము అత్త పోరు భరించాం కదా.. తమ కోడలు కూడా భరించాలని చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు. ఇలా అత్తాకోడళ్ల గొడవల మధ్య ఎంతో తాము నలిగిపోతున్నామని చాలా మంది మగాళ్లు బాధపడుతుంటారు. అయితే ఇలా అత్తాకోడళ్ల గొడవ మధ్య దూరిన ఓ వ్యక్తి చివరకు కటకటాల పాలవ్వాల్సిన స్థితి వచ్చింది.

అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని బద్లాపూర్కు తూర్పున ఉన్న షిర్గావ్ ప్రాంతంలోని మౌలీచౌక్లో అశ్విన్ నికుంభ్(32) అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. గత నెల 30వ తేదీన అశ్విన్ భార్య కోమల్(22) వంట గదిలో భోజనం సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో ఆమె అత్త అక్కడికి వచ్చి.. చపాతీ బాగా చేస్తావా అని అడిగింది. దానికి కోమల్ కాస్త వెటకారంగా.. మా అత్త గారిని దృష్టిలో పెట్టుకుని మంచిగానే తయారు చేస్తాను అని చెప్పింది.

అత్త అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావ్ అంటూ ఆమె కోమల్తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం విన్న అశ్విన్.. తన భార్య కోమల్ ఎడమ చెవిపై రాయితో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె కర్ణభేరి పగిలిపోయింది. అంతటితో ఆగకుండా.. బెల్టుతో దాడి చేశాడు. ఓవైపు తనకు సపోర్ట్ చేయకపోగా.. రక్తం వచ్చేలా కొట్టిన భర్తపై కోపంతో కోమల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అశ్విన్పై 325,324,504సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.