Begin typing your search above and press return to search.

మనుషుల్లో ఇన్ని రోగాలేలా? తాజా పరిశోధనలో తేలిన నిజం ఇదే

By:  Tupaki Desk   |   29 Jun 2023 9:00 AM GMT
మనుషుల్లో ఇన్ని రోగాలేలా? తాజా పరిశోధనలో తేలిన నిజం ఇదే
X
ఒక భారీ పరిశోధన కారణంగా ఇంతకాలంగా గుట్టుగా ఉన్న అంశాల్ని బయటకు వచ్చేలా చేసింది. మనషులు ఇన్నేసి రోగాల బారిన పడతారు సరే.. మరి.. మనిషి చేష్టలకు దగ్గరగా ఉండే కోతిలో రోగాలు ఎందుకు ఉండవు? అన్న సందేహానికి సమాధానాన్ని వెతికే క్రమంలో హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం ఒక భారీ అధ్యయనాన్నిచేపట్టారు.

ఈ సందర్భంగా వారు ఆసక్తికర అంశాల్ని గుర్తించారు. తమ అధ్యయనంలో భాగంగా 233 జాతులకు చెందిన కోతుల నుంచి 809 జన్యుక్రమాల్ని మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్ లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు.. విశ్లేషణను చేపట్టిన సీసీఎంబీ.. కోతులకు రక్షగా నిలుస్తున్న అంశాలేమిటన్న దానిపై ఫోకస్ చేసింది. మనిషి.. కోతి జన్యుక్రమాల్ని పోల్చి చూస్తే.. రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్ సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లుగా గుర్తించారు.

ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖల్ని మారుస్తాయి. దీంతో ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యు ప్రొటీన్లు సక్రమంగా పని చేయకుండా మనుషుల్ని జబ్బుల బారిన పడేస్తుంటాయి. ప్రస్తుతం చేపట్టిన అధ్యయనంలో 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు ఉన్నట్లుగా గుర్తించారు.

వీటిల్లో ఆరు శాతం తేడాల్ని గుర్తించారు. మనుషుల్లో కంటే కోతుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మనుషులు రోగాల బారిన పడకుండా కాపాడుతున్నట్లుగా భావిస్తున్నారు.

అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వానర జాతుల జన్యుక్రమాల్ని నమోదు చేశారు. భూమి మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. వీటిల్లో అతి చిన్న కోతి జాతి మొదలుకొని చింపాజీ వరకు అన్ని రకాల కోతుల జన్యుక్రమాలను సేకరించే ప్రయత్నం చేశారు. దీంతో.. పరిణామ క్రమంలో వచ్చిన మార్పుల్ని పరిశీలించే వీలు కలుగుతుంది. అంతేకాదు.. కోతుల్ని.. మనుషుల్ని వేరు చేసే అంశాలేమిటో కూడా మరింత స్పష్టం కానున్నాయి.

తాజా అధ్యయంలో ఇప్పటివరకు గుర్తించిన అంశాల్ని చూసినప్పుడు.. మనిషికి మాత్రమే ప్రత్యేకం అనుకున్న జన్యుపరమైన అంశాలు సగం తగ్గాయని.. అంటే మనిషికి కోతికి మధ్య అంతరం సగానికి పైగా తగ్గినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం అధ్యయనం పూర్తి అయితే.. మరిన్ని ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యే వీలుంది.