Begin typing your search above and press return to search.

అమెరికాలో భారత విద్యార్థిని అదృశ్యం.. వెంటాడుతున్న భయం..!

By:  Tupaki Desk   |   11 Feb 2023 6:00 PM GMT
అమెరికాలో భారత విద్యార్థిని అదృశ్యం.. వెంటాడుతున్న భయం..!
X
అమెరికాలో భారత సంతతి విద్యార్థిని అదృశ్యమై మూడు వారాలు గడుస్తోంది. బాలిక కోసం ఓవైపు కుటుంబ సభ్యులు.. స్థానికులు.. మరోవైపు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థిని జాడ కనిపించక పోవడంతో ప్రతి ఒక్కరికి భయం వెంటాడుతోంది. దీంతో విద్యార్థినీ మిస్సింగ్ కేసు అమెరికాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని కాన్వే ఏరియాలో పవన్.. శ్రీదేవి అనే భారతీయ జంట నివాసం ఉంటున్నారు. వీరిద్దరు ఐటీ కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు. అమెరికా కొన్నేళ్లుగా ఉంటున్న ఈ జంట అక్కడి పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ జంటకు తన్వీ అనే కూతురు ఉంది. ప్రస్తుతం బాలిక వయస్సు 14 ఏళ్లు. అమెరికాలో కొనసాగుతున్న లేఆఫ్ కారణంగా ఇటీవల తన్వీ తల్లి ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది.

కాగా ప్రతి రోజు మాదిరిగానే తన్వీ జనవరి 17న తన చదువుతున్న పాఠశాలకు వెళ్లింది కానీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తన్వీ తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు చేరుకొని యాజమాన్యం సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తన్వీ ఆచూకీ తెలిపిన వారికి 5వేల డాలర్లు ఇస్తామని తల్లిదండ్రులు ప్రకటించారు. బాలిక అదృశ్యమై మూడు వారాలు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించకపోవడం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

అయితే ఇటీవల అమెరికాలో కొనసాగుతున్న లేఆఫ్ కారణంగా తన తండ్రి ఉద్యోగం కోల్పోతే తాము ఎక్కడ అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందనే ఆందోళనతోనే తన్వీ కన్పించకుండా పోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై తన్వీ తల్లిదండ్రులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల శ్రీదేవి ఉద్యోగం కోల్పోయిందని.. తండ్రి ఉద్యోగం కూడా పోతే తాము భారత్ కు వెళ్లిపోక తప్పదని బాలిక కలవరానికి గురైందన్నారు. ఈ కారణంగా బాలిక ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు సైతం వెల్లడించడం గమనార్హం.

కాగా అమెరికా మీడియా కథనం ప్రకారం గత నవంబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 2లక్షల మంది ఐటీ ఉద్యోగులకు టెక్ కంపెనీలు ఉద్వాసన పలికాయి. గూగుల్.. మైక్రోసాప్ట్.. మేటా.. ఫేస్ బుక్.. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీరిలో సుమారు 30 నుంచి 40 శాతం వరకు హెచ్ 1బీ.. ఎల్ 1 వీసాలు ఉన్న భారతీయ టెక్ నిపుణులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఏది ఏమైనా అమెరికాలో కొనసాగుతున్న లేఆఫ్ కారణంగా ఓ బాలిక భయపడి మూడు వారాలైనా ఇంటికి చేరుకోకపోవడం శోచనీయంగా మారింది. ఈ కారణంగానే బాలిక ఇంటికి రాలేదా? మరేదైనా కారణం ఉందా? అనేది మాత్రం బాలిక ఆచూకీ లభిస్తేగానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కేసును పోలీసులు త్వరగా చేధించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.