Begin typing your search above and press return to search.

నగదు రహిత క్లెయిమ్‌ తిరస్కరించొద్దు .. బీమా కంపెనీలకు ఆదేశాలు !

By:  Tupaki Desk   |   10 May 2021 8:30 AM GMT
నగదు రహిత క్లెయిమ్‌ తిరస్కరించొద్దు ..  బీమా కంపెనీలకు ఆదేశాలు !
X
కరోనా సెకండ్ వేవ్ లో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తున్నాయి. దీనితో ఐఆర్‌ డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌ లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్‌లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్‌ వర్క్‌ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి అని తన ఉత్తర్వుల్లో ఐఆర్‌ డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే , ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి.

నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి అని ఐఆర్‌ డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్‌ మెంట్‌ పొందడం ఒక్కటే మార్గం. నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్‌ వర్క్‌ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్‌ మెంట్‌ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్‌ హాస్పిటల్‌ లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు.