Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదా? అసలు నిజం ఏంటి?

By:  Tupaki Desk   |   27 Nov 2021 1:30 AM GMT
కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదా? అసలు నిజం ఏంటి?
X
ధాన్యం కొనుగోలు చేయడం లేదని ధర్నా చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో తేల్చుకుందామని రెడీ అయ్యారు. అయితే కేసీఆర్ తో మోడీ, షాలు భేటి కాలేదు. దీంతో ఢిల్లీ పెద్దలు కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని బీజేపీ ప్రచారం చేసుకుంటుండగా... అసలు కేసీఆరే వారి అపాయింట్ మెంట్ కోరలేదని టీఆర్ఎస్ చెబుతోంది. మరి కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్టు అన్నది ఇక్కడ ప్రశ్న.

వరి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఇరుపార్టీలు తమ పంతం కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శ రెండు పార్టీలపై చెలరేగుతోంది.

యాసంగి వరిధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం అస్పష్ట వైఖరి కొనసాగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కేంద్రంపై మండిపడుతూనే వరిధాన్యం కొనుగోలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ తన మంత్రులు, అదికారుల బృందంతో కలిసి వెళ్లారు. అంతకుముందు ఇందిరా పార్క్ వద్ద కేంద్రం వైఖరి నిరసిస్తూ ఒకరోజు ధర్నా చేశారు.

అనంతరం మూడు రోజుల పాటు ఢిల్లీ టూరుకు ప్లాన్ చేసి గడిచిన ఆదివారం తన బృందంతో కలిసి వెళ్లారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. కానీ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ప్రధాని మోదీతోపాటు ఇతర కేంద్రమంత్రులు ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాల ఆరోపణ. దీంతో కేంద్రం టీఆర్ఎస్ బృందాన్ని కేసీఆర్ ను అవమానించారని ఫోకస్ అయ్యింది. దీన్ని అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. కేంద్రం వైఖరిని తూర్పార పట్టారు. దీంతో రాజకీయం మరింత ముదిరింది.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తూనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రకటన చేశాయి. మోడీ, అమిత్ షాలను కలవడానికి తెలంగాణ సీఎంవో నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని స్పష్టం చేశాయి. తాజాగా కేసీఆర్ అండ్ టీం తమను ఎలాంటి అపాయింట్ మెంట్ అడగలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

దీంతో సీఎం కేసీఆర్ మరోసారి ఇరుకున పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓవైపు వానాకాలం వరిధాన్యం కొనుగోలుపై రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సీఎం కేసీఆర్ రానున్నా యాసంగి ధాన్యం కోసం పోరాటం చేయడం కూడా రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో కేసీఆర్ మూడు రోజులు మకాం వేసి సాధించింది ఏంటనేది రాజకీయ వర్గాల్లో రైతుల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ ఎత్తుగడ భూమరాంగ్ అయ్యిందంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.