Begin typing your search above and press return to search.

రాకేశ్ అంతిమ యాత్ర‌లో టీఆర్ఎస్ డ‌బ్బులు పంచిందా?

By:  Tupaki Desk   |   20 Jun 2022 2:30 AM GMT
రాకేశ్ అంతిమ యాత్ర‌లో టీఆర్ఎస్ డ‌బ్బులు పంచిందా?
X
రాజ‌కీయాల‌కు సంబంధించి ఏం చెప్పినా ఎంత చెప్పినా త‌క్కువ‌గానే ఉంటుంది. ఏ క్ష‌ణాన ఎవరు ఎటు వైపుగా నిర్ణ‌యాలు తీసుకుని  వెళ్తారో చెప్పలేం. ఎంత ఘోరం అంటే రైల్వే పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ చుట్టూ కూడా కొన్ని శ‌వ రాజ‌కీయాలే న డుస్తున్నాయి అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు అగ్నిప‌థ్ పై స్పందిస్తున్న టీఆర్ఎస్ బాసర ఐఐటీ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ఎందుకు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని  విమ‌ర్శ‌లు వ‌చ్చినా అవి మాత్రం ప‌ట్టించుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా టీఆర్ఎస్ ది ద్వంద్వ వైఖ‌రే అని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లో ప్రాణాలు కోల్పోయిన వ‌రంగ‌ల్ జిల్లా వాసి దామెర రాకేశ్ అంతిమ యాత్ర నిన్న‌టి వేళ (18 జూన్ , 2022 ) జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అనేక ఆస‌క్తిదాయ‌క విష‌యాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా వ‌రంగ‌ల్ ఏజీఎం ఆస్ప‌త్రి నుంచి రాకేశ్ స్వ‌స్థ‌లం ఖానాపురం మండలం దబీర్‌పేట వరకు చేప‌ట్టిన అంతిమ యాత్ర‌లో టీఆర్ఎస్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ తో పాటు ఇంకొంద‌రు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  అంతిమ యాత్ర వాహ‌నానికి టీఆర్ఎస్ జెండాలు క‌ట్ట‌డ‌మే కాకుండా కొంద‌రు ఇక్క‌డికి ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా వ‌చ్చేందుకు అధికార పార్టీ త‌ర‌ఫున డ‌బ్బులు పంచార‌న్న వాద‌న కూడా వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా హ‌ల్చ‌ర్ చేస్తున్నాయి. అంతిమ యాత్ర‌లో పాల్గొనేందుకు మూడు వంద‌లు బ‌దులు రెండు వంద‌లే ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. మ‌రోవైపు కాంగ్రెస్ కూడా అధికార పార్టీ చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తోంది. జాతీయ జెండాలు ఉండాల్సిన చోట పార్టీ జెండాలు ఎందుక‌ని ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించింది.

మరోవైపు ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని వెతికి, వెతికి అరెస్టులు చేసేందుకు రైల్వే పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఓ అకాడ‌మీ నిర్వాహ‌కుడ్ని అరెస్టు చేశారు. మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తున‌కు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేస్తున్నారు.