Begin typing your search above and press return to search.

'మూడు'తో ముప్పు: తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని గుర్తించారా?

By:  Tupaki Desk   |   20 March 2023 6:00 AM GMT
మూడుతో ముప్పు: తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని గుర్తించారా?
X
అంచనాలు లేకుండా ఆటలోకి దిగి.. అలుపు లేకుండా శ్రమిస్తే అందుకు వచ్చే ఫలితం అనూహ్యంగా ఉంటుందన్నది అందరికి తెలిసిందే. అయితే.. అందుకు అన్ని కలిసి రావాలి. ఒక్క ఆట బాగా ఆడితేనే సరిపోదు. వాతావరణం అనుకూలంగా.. పరిస్థితులు సానుకూలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అనుకున్న దాని కంటే బాగా జరుగుతాయి. తాజాగా వెలువడిన ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పోటీ జరిగిన మూడు స్థానాల్లో విపక్ష తెలుగుదేశం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపు మీద ఎలాంటి ముందస్తుగా అంచనాలు లేకపోవటంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సైతం ఆశ్చర్యానికి గురైంది.

ఈ విజయం టీడీపీకి కొండంత బలంగా మారిందనటంలో సందేహం లేదు. గడిచిన మూడున్నరేళ్లుగా తగులుతున్న ఎదురుదెబ్బలకు పుల్ స్టాప్ పడినట్లుగా భావిస్తున్నారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న తమ అంచనాలు నిజమన్న విషయాన్ని తాజా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక స్పష్టం చేసిందన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తెలుగు తమ్ముళ్లు ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకూడదంటున్నారు. ఇప్పటివరకు తెలుగు తమ్ముళ్లు వచ్చే ఎన్నికల్లో తమతో పాటు తమతో కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉండటం తెలిసిందే.

తాజా విజయంతో ఉత్సాహం అత్యుత్సాహంగా మారకూడదన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదంటున్నారు. తాజాగా ఎన్నికలు కేవలం ఒక పరిమితమైన సెక్షన్ ప్రజలు మాత్రమే పాలు పంచుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. తాజా గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో తమతో కలిసి వచ్చే అవకాశం ఉన్న రాజకీయ పక్షాల పట్ల చిన్నచూపు చూసినా.. చులకనగా చూసినా భారీ నష్టం తప్పదన్న హెచ్చరిక రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. శత్రువు బలం ఏమిటన్న అంచనా విషయంలో జరిగే పొరపాట్లతో నస్టం భారీగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు.

అందుకే.. మూడు సీట్లలో సాధించిన విజయం తెలుగు తమ్ముళ్లలో మరింత అణుకువను పెంచాలే తప్పించి.. అహంకారాన్ని పెంచేలా ఉండకూడదంటున్నారు. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు చోటు చేసుకున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే.. మూడు స్థానాల్లో విజయం మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదంటున్నారు. మూడు స్థానాల్లో లభించినవిజయం తాలుకూ ఆనందం తమ్ముళ్ల మనోధైర్యాన్ని పెంచేలా ఉండేలా కానీ.. కలిసి వచ్చే మిత్రుల మనసుల్ని గాయపరిచేలా ఉండకూడదన్నది మర్చిపోకూడదు. మరి.. తమ్ముళ్లు ఏ తీరులో వ్యవహరిస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.