Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ కు డీజీపీ అపాయింట్మెంట్ నిరాకరించారా?

By:  Tupaki Desk   |   1 Jun 2022 3:30 PM GMT
పవన్ కల్యాణ్ కు డీజీపీ అపాయింట్మెంట్ నిరాకరించారా?
X
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు జగన్ వర్సెస్ పవన్ గా మారిపోయాయి. గుంటూరు జిల్లా ఇప్పటం జరిగిన జనసే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కల్యాణ్ ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు చోటా మోటా నేతలు పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలకు దిగారు.

మరోవైపు వైఎస్సార్సీపీ నేతల మాటల దాడికి జనసేన నేతలు, కార్యకర్తలు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ ఏ పార్టీ లేనంత బలంగా ఉండటంతో అధికార వైఎస్సార్సీపీ పై పోస్టులతో చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. పవన్ కల్యాణ్ ను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎంత దూషించినా కేసులు నమోదు చేయని జగన్ ప్రభుత్వం తమపై మాత్రం కేసులు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే ఇటీవల అమలాపురం అల్లర్లను కూడా జనసేన పార్టీకి చుట్టిన సంగతి తెలిసిందే. విధ్వంసానికి దిగినవారంతా జనసేన కార్యకర్తలేనని మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు పెట్టిన కేసుల గురించి మాట్లాడటానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ కు డీజీపీ అపాయింట్ మెంట్ నిరాకరించారని సమాచారం.

పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇస్తే ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందని డీజీపీ అపాయింట్ మెంట్ నిరాకరించారని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

డీజీపీ అపాయింట్ మెంట్ ఇస్తే తమ పార్టీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులు, ఏయే సెక్షన్ల కింద పెట్టారు తదితరాలపై పవన్ కల్యాణ్ ఆయనకు వివరించాలనుకున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.

అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గి డీజీపీ పవన్ కు అపాయింట్ మెంట్ నిరాకరించారని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ కార్యకర్తలయితే ఒకలాగా, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలయితే మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తమపై దాడులకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అదే తమపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.