Begin typing your search above and press return to search.

ఇతడిది నోరేనా? 165 కేజీలు ఎత్తేశాడు.. మామూలోడు కాదు

By:  Tupaki Desk   |   9 Feb 2023 1:00 PM GMT
ఇతడిది నోరేనా? 165 కేజీలు ఎత్తేశాడు.. మామూలోడు కాదు
X
చేతులతో ఎంత బరువును ఎత్తుతారు? అని ప్రశ్నిస్తే.. చాలామంది పాతిక కేజీలు అని చెబుతారు. కొద్దిమంది యాభై నుంచి 60 కేజీల వరకు ఎత్తేస్తామని చెబుతారు. చాలా తక్కువ మంది మాత్రం వంద కేజీల వరకు ఎత్తే ప్రయత్నం చేయగలమని చెబుతారు. చేతులతో కాదు.. నోటితో బరువు ఎత్తాలని అడిగితే.. వెంటనే సమాధానం చెప్పలేరు. ఆ మాటకు వస్తే పెద్దగా ప్రయత్నించింది ఉండదు. తాజాగా బిహార్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ చేసిన ఫీట్ గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

తన నోటితో ఒకటి కాదు రెండు కాదు యాభై కాదు.. ఏకంగా 165కేజీల బరువును అలవోకగా ఎత్తేయటమే కాదు.. పోటీల్లోని నిబంధనలకు తగ్గట్లు 10 సెకండ్లు హోల్డ్ చేసిన వైనం గురించి తెలిస్తే.. అతడు మనిషేనా? లేదంటే సినిమాల్లో చూపించే ఐరన్ మ్యానా? అన్న అనుమానం రాక మానదు. ధర్మేంద్ర పాత రికార్డుల్ని చూస్తే.. అతను ఇప్పటికే తొమ్మిది ప్రపంచ రికార్డుల్ని క్రియేట్ చేశాడు.

హ్యామర్ హెడ్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఇతను బిహార్ లోని రామ్ గఢ్ ప్రాంతానికి చెందిన వాడు. తాజాగా త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన పోటీల్లో అరుదైన ఫీట్ చేసి అందరిని చూపు తన మీద పడేలా చేశాడు.

డిసెంబరులో జరిగిన ఫోటీల్లో 122 కేజీల బరువు ఉన్న బైక్ ను భుజం మీద మోస్తూ 30 సెకన్లలో వంద మీటర్ల దూరాన్ని పరిగెత్తాడు. ఇతగాడి రికార్డుకు వావ్ అనుకునేలోపు.. తల మీద పెట్టించుకొని కొబ్బరికాయ పగలకొట్టించుకోవటం.. నోటితో ఇనుమును వంచటం లాంటివి చేసి అందరిని ఆకర్షించాడు.

తాజాగా అతను తన నోటికి తాడు కట్టుకొని.. 165 కేజీల బరువున్న రాయిని ఎత్తేయటమే కాదు.. దాదాపు పదిసెకన్లకు పైనే దాన్ని హోల్డ్ చేసిన వైనంతో కొత్త రికార్డు ఆయన పేరు మీద క్రియేట్ అయ్యింది. ఇటీవల ఇతడ్ని నోటితో 165 కేజీల బరువు ఎత్తగలవా? అని సవాలు విసరటంతో ఇతగాడు ఈ ఫీట్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ ధర్మేంద్ర ఏం చేస్తుంటాడు? అన్న ప్రశ్నకు ఇలాంటి ఫీట్లు మాత్రమే కాదు.. త్రిపుర రైఫిల్స్ విభాగంలో జవానుగా పని చేస్తుంటాడు. ధర్మేంద్ర అసలుసిసలైన ఐరన్ మ్యాన్ అని చెప్పక తప్పదు. కాదంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.