Begin typing your search above and press return to search.

స్ట్రాంగ్ రూం ఓపెన్.. 17 గంటల పాటు పరిశీలన.. ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   24 April 2023 11:22 AM GMT
స్ట్రాంగ్ రూం ఓపెన్.. 17 గంటల పాటు పరిశీలన.. ఏం జరిగింది?
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగున్నరేళ్లుగా సాగుతున్న టెన్షన్ కు త్వరలో తెర పడనుంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ఫలితంపై నెలకొన్న పంచాయితీ ఎట్టకేలకు వీడిపోయే సమయం ఆసన్నమైందని చెప్పాలి.

గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించటం.. వాయిదాల మీద వాయిదాలతో.. పలు నాటకీయ పరిణామాలతో ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో వీఆర్కే కాలేజీ స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేయటం తెలిసిందే.

స్ట్రాంగ్ రూం తెరవాలని హైకోర్టు చెప్పినా.. తాళాలు కనిపించట్లేదన్న విషయం బయటకు రావటం.. తిరిగి కోర్టులను ఆశ్రయించిన వేళ.. తాళాల్ని పగలగొట్టాలని కోర్టు ఆదేశించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. అందరి సమక్షంలో ఆదివారం పదకొండు గంటల వేళలో తాళాల్ని పగలకొట్టి.. స్ట్రాంగ్ రూమ్ ను తెరిచారు. అలా మొదలైన డాక్యుమెంట్ల పరిశీలన.. ఈ ఉదయం (సోమవారం) 4.50 గంటల వేళలో డాక్యుమెంట్ల పరిశీలన ముగిసింది.

దీనికి సంబంధించిన నివేదిక ఈ నెల 26 లోపు హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. జగిత్యాల జిల్లా అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంను తెరిచిన సమయంలో ఎన్నికల అధికారి.. కలెక్టకర్ యాస్మిన్ బాషా.. పార్టీల అభ్యర్థులు.. స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

వీరంతా గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సీసీ పుటేజ్ లకు సంబంధించిన జిరాక్సులను అటెస్టు చేస్తూ.. నివేదిక హైకోర్టుకు సమర్పించనున్నారు. ఈ నియోజకవర్గానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

సదరు ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందటం తెలిసిందే. మరో రెండు రోజుల్లో నాలుగున్నరేళ్లుగా సాగుతున్న ఉత్కంటకు తెరపడినట్లు అవతుందని చెప్పాలి.