Begin typing your search above and press return to search.

అమ్మా ఆగండాగండి.. అలా వెళ్లిపోమాకండి..: ఏపీ మంత్రి విన్న‌పాలు

By:  Tupaki Desk   |   4 April 2023 9:51 AM GMT
అమ్మా ఆగండాగండి.. అలా వెళ్లిపోమాకండి..: ఏపీ మంత్రి విన్న‌పాలు
X
ఏపీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. శ్రీకాకుళంలో నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో చిత్ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. బ‌ల‌వంతంగా తీసుకువ‌స్తున్నారో.. లేక‌.. స్వ‌చ్ఛందంగా వ‌స్తున్నారో.. తెలియ‌దు కానీ, మ‌హిళ‌లు ఆయా స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. కానీ, స‌భ మొద‌లు కాగానే.. అందునా ధ‌ర్మాన ప్ర‌సంగం ప్రారంభం కాగానే.. మ‌హిళ‌లు ప‌రుగు ప‌రుగున వెళ్లిపోతున్నారు. దీంతో వారిని అదుపు చేయ‌లేక వైసీపీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక‌, వేదిక‌పై నుంచే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. మ‌హిళ‌ల‌కు విన్న‌పాలు వినిపించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అమ్మా.. ఆగండాగండి.. అలా వెళ్లిపోమాకండి.. అని ఆయ‌నప్రాథేయ ప‌డే ప‌రిస్థితి వ‌స్తోంది.

తాజాగా శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో నిర్వహించిన ఆసరా పథకం నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన.. 2024లో చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని.. ప్రజలను హెచ్చరించారు. అయితే ప్రసంగం మధ్యలో మహిళలు వెళ్లిపోవడాన్ని గమనించిన మంత్రి.. ''అమ్మా.. ఆగండాగండి.. అలా వెళ్లిపోమాకండి.. ఐదు నిమిషాల్లో సభ ముగుస్తుందం''టూ వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎవ‌రూ వినిపించుకోలేదు.

ఇక‌, త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు ఎవరూ ఓట్లు వేయ్యరని.. ఒకవేళ వేస్తే వాళ్ల చేతులను వాళ్లే నరుకున్నట్లు అని మంత్రి ధర్మాన అన్నారు. మహిళా సంఘాల అప్పులు చంద్రబాబు కట్టలేదన్న ధర్మాన.. విడత విడతలుగా కడతామని ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారన్నారు.

"మాకు చాలా బలమైన గ్రామాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ గ్రామాల్లో మాకు మెజార్టీ వస్తుంది. పాత్రునివలస, చాపారం, లంకాం, వాకాలపాడు, రాగోలు ,పెద్దపాడు అన్ని గ్రామాలు మాకు బలమైనవి. ప్రతి సమస్యను మేము పరిష్కరించే పని చేస్తూనే ఉన్నాం. మీ సహకారం ఎప్పుడూ వైసీపీకి ఉండాలని కోరుకుంటున్నా" అని వ్యాఖ్యానించారు.

''మహిళలు అనే వాళ్లు ఎవరూ చంద్రబాబుకి ఓటు వెయ్యరు. వేస్తే వాళ్ల చేతులను నరుక్కున్నట్లే. సంక్షేమ పథకాలను ఇవ్వాలంటే ఆ వ్యక్తికి మనం అధికారం ఇవ్వాలి. ఆ అధికారం ఇచ్చే శక్తి మన అందరికీ ఉంది. మనం అధికారం ఇస్తేనే.. అతను మనకి తిరిగి ఇవ్వగలడు. 2019లో మీరు ఇచ్చిన అధికారం వల్లనే ఈరోజు మీ అంకౌట్లలో డబ్బులు పడుతున్నాయి.

సంవత్సరం తర్వాత ఇవి ఆగిపోతాయి'' అని ధ‌ర్మాన ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో.. మ‌హిళ‌లు పెద్ద ఎత్తున స‌భ నుంచి వెళ్లిపోయే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ధ‌ర్మాన‌.. హే తల్లి హే.. మీటింగ్ అయిపోయింది. వెళ్లిపోదురు కానీ ఆగండి. ఇంకో ఐదు నిమిషాల్లో మీటింగ్ అయిపోద్ది! అని వారిని ఆపే ప్ర‌య‌త్నం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.