Begin typing your search above and press return to search.

మరో వివాదంలో వైసీపీ మంత్రి!

By:  Tupaki Desk   |   29 Jun 2023 4:00 PM GMT
మరో వివాదంలో వైసీపీ మంత్రి!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ శ్రమిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను హెచ్చరిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తమకు ఓట్లేయకపోతే అభివృద్ధి పథకాలను ఆపేస్తామని, తమకు ఎన్నికల్లో మెజారిటీ ఇవ్వలేదని.. అయినా తమను అభివృద్ధి చేయాలని ప్రశ్నించే హక్కు మీకెక్కడ ఉందని నిలదీస్తున్నారు.

తాజాగా ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ ధర్మాన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వలంటీర్లు వైసీపీ కోసం కష్టపడాలని.. లేకపోతే వారిని తొలగిస్తామని గతంలో ధర్మాన హెచ్చరించారు. ఇక తాజాగానూ ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చారు. కొందరు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ టీడీపీకి ఓటు వేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ధర్మాన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి... అండగా నిలవకపోతే మీరే నష్టపోతారని ప్రజలను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు.

గత నాలుగు ఎన్నికల్లో ఎప్పుడూ పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేటల్లో.. తనకు మెజార్టీ రాలేదని ధర్మాన గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు చేయండని అడిగే హక్కు ప్రజలకు ఎక్కడి ఉందని నిలదీశారు. తనకు ఓటు వేయనప్పటికీ ఆయా గ్రామాల అభివృద్ధికి లక్షలు ఖర్చు చేస్తున్నానన్నారు.

గతంలో తాను అధికారంలో ఉండగా ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇచ్చానని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈసారి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మీరు ఓట్లు గెలిపించిన టీడీపీ నాయకులు ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ధర్మాన నిలదీశారు.

చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలో మహిళలు తమ భర్తలను ప్రశ్నించాలని ధర్మాన కోరడం గమనార్హం. ఈ కార్యక్రమానికి అనేక మంది తెలుగుదేశం నేతలకు భయపడి రాలేదన్నారు. ధర్మాన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఓవైపు తమకు ఓటేసినవారికి, ఓటేయని వారిపైన ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అని జగన్‌ చెబుతుంటే అందుకు విరుద్ధంగా మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.