Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేది ఆమేనా?

By:  Tupaki Desk   |   14 May 2023 6:00 AM GMT
కీలక నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేది ఆమేనా?
X
ఏపీలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి.. గన్నవరం. కృష్ణా జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్‌ టీడీపీ తరఫున గెలుపొందారు. అయితే గెలిచిన కొంత కాలానికే వంశీ వైసీపీతో అంటకాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ లను వంశీ పలుమార్లు తిట్టిపోశారు. పలుమార్లు ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ముఖ్యంగా చంద్రబాబు సతీమణిపై వంశీ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. అయితే వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి వెళ్లిపోయాక గన్నవరంలో టీడీపీకి గట్టి అభ్యర్థి లేకుండా పోయారు. కొన్నాళ్లు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును ఇంచార్జిగా నియమించారు. అయితే ఆర్థికంగా, దూకుడుగా ఉండటంతో బచ్చుల అర్జునుడు వంశీకి సరితూగలేడని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా అర్జునుడు ఇటీవల గుండెపోటుకు గురై మృతి చెందారు.

బచ్చుల అర్జునుడు మృతితో బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను గన్నవరం ఇంచార్జిగా నియమించారు. అయితే ఆయన 2009, 2014లో బందరు ఎంపీగా గెలుపొందారు. దీంతో తన కొత్త చోటు అయిన గన్నవరంలో సరిగా కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు తల్లి, విజయవాడ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ రంగంలోకి దిగారు. అన్న క్యాంటీన్లను నిర్వహించడంతోపాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ క్యాడర్‌ ను కలుస్తున్నారు. లోకేష్‌ తమకే టికెట్‌ అని హామీ ఇచ్చారని.. పోటీ చేసేది తామేనని అపర్ణ కుమారుడు చందు చెబుతున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా గన్నవరం రూరల్‌ మండలంలోని ప్రార్థనా మందిరాలకు చెందిన పాస్టర్లతో సమావేశమై 40 మందికి వాటర్‌ కూలర్లు పంపిణీ చేశారు. మల్లవరంలో నిలిచిపోయిన పరిశ్రమలు, అశోక్‌ లేలాండ్‌ పరిశ్రమపై వైసీపీ నేతలకు దేవినేని అపర్ణ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. రెండు అన్న క్యాంటీన్ల వాహనాలు ప్రారంభించనున్నామని చెబుతున్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

మరోవైపు వల్లభనేని వంశీ వైసీపీలోకి రావడాన్ని ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వంశీకే వచ్చే ఎన్నికల్లో జగన్‌ టికెట్‌ ఖరారు చేశారు. దీంతో ఆయన సమయం చూసుకుని టీడీపీలోకి దూకడానికి చూస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

ఇంకోవైపు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా గన్నవరం స్థానంపై కన్నేశారని అంటున్నారు. తనకు సీటు ఇస్తే వంశీపై గెలిచి వస్తానని చంద్రబాబుకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎవరిని గన్నవరం అభ్యర్థిగా ఫైనల్‌ చేస్తారో వేచిచూడాల్సిందే.