Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో కీలక పరిణామం: ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి షాక్‌!

By:  Tupaki Desk   |   14 April 2023 11:12 AM GMT
వివేకా హత్య కేసులో కీలక పరిణామం: ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి షాక్‌!
X
మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ప్రస్తుతం వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 30 నాటికి వివేకా హత్య కేసు విచారణను ముగించాలని సీబీఐకి గడువు నిర్దేశించింది. ఇందులో భాగంగా దర్యాప్తు అధికారులను కూడా మార్చింది. ప్రత్యేకంగా కొంతమంది అధికారులతో సిట్‌ ను ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. పులివెందులలో అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కడప నుంచి తీసుకువెళ్తోంది. వివేకానందరెడ్డి హత్య జరిగాక ఉదయ్‌ కుమార్‌ రెడ్డి ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్టు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14న ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేసి కడప సెంట్రల్‌ జైలులోని గెస్ట్‌ హౌస్‌ కు తీసుకెళ్లి అతడిని విచారించింది. అనంతరం ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ అధికారులు అతడి కుటుంబసభ్యులకు తెలిపారు.

మరోవైపు ఉదయ్‌ తండ్రి జయప్రకాశ్‌ రెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్‌ వెళ్లినట్లు సీబీఐ నమ్ముతోంది. వివేకా హత్య జరిగాక ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది.

అదేవిధంగా వైఎస్‌ వివేకా భౌతిక కాయానికి ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి జయప్రకాశ్‌ రెడ్డి బ్యాండేజ్‌ కట్లు కట్టినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా గతంలోనే ఉదయ్‌ ను పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు.

వివేకా హత్య రోజు నిందితులతో కలిసి ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తిరిగినట్టు అధికారులు గుర్తించారు. హత్యలో ఉదయ్‌ కుమార్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. తన కుమారుడు అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా నిందితులతో తిరిగాడని ఉదయ్‌ తల్లి గతంలోనే బహిరంగంగా వెల్లడించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ కేసు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.