Begin typing your search above and press return to search.

ఆప్ గవర్నమెంట్ యాప్ సేవలు

By:  Tupaki Desk   |   4 Feb 2016 11:00 AM GMT
ఆప్ గవర్నమెంట్ యాప్ సేవలు
X
వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులతో రాజధాని ప్రజల అభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం వైద్యపరమైన సంస్కరణలకు మార్గం వేస్తోంది. అదేక్రమంలో ప్రజలకు ఉపయోగపడేలా పలుసేవలను అందుబాటులోకి తెస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రిస్క్రిప్షన్ పై అన్ని మందులూ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన రెండు రోజుల్లోనే అక్కడి వైద్య మంత్రి మరో ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరక్కపోయినా,  ఇవ్వకపోయినా వెంటనే ఫిర్యాదు చేసేలా మొబైల్ యాప్ ఒకటి త్వరలో రిలీజ్ చేస్తామన్నారు.

ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచిత మందుల పథకాన్ని ప్రవేశపెట్టింది ఆప్ ప్రభుత్వం. అంతేకాదు... ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరక్కపోతే వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక హైల్ప్ లైన్ నంబరునూ ప్రవేశపెట్టింది. ఈ నంబరుకు ఎస్సెమ్మెస్ పంపించి ఫిర్యాదు చేయొచ్చు. మరో అడుగు ముందుకేసి శుక్రవారం దీనికి సంబంధించిన యాప్ ను కూడా విడుదల చేయనున్నారు.

ఒకవేళ ఆసుపత్రిలో మందులు దొరక్కపోతే వెంటనే ప్రిస్క్రిప్షన్ ఫొటోతీసి యాప్ లో అప్ లోడ్ చేయాలి. వెంటనే ఫిర్యాదు రిజిష్టరవుతుంది. మళ్లీ మందులు అందుబాటులోకి రాగానే  వెంటనే ఆ సమాచారం రోగి ఫోన్ కు అందుతుంది. ఇలాంటి యాప్ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రవేశపెడితే రోగులుకు ఎంతో మేలు జరుగుతుందనడంలో సందేహమే లేదు.