Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ కు ఓవర్ యాక్షన్ అవసరమా ?

By:  Tupaki Desk   |   26 Jun 2023 6:00 PM GMT
కేజ్రీవాల్ కు ఓవర్ యాక్షన్ అవసరమా ?
X
కష్టాల్లో ఉన్నవాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇంతచిన్న విషయాన్ని కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరచిపోయారు. ముందు ఓవర్ యాక్షన్ చేసేసి ఇపుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో భేటీకి నానా అవస్తలు పడుతున్నారు.

ఇంతకీ జరిగింది ఏమిటంటే రాహుల్ తో టీ భేటికి కేజ్రీవాల్ ఆహ్వానంపంపారు. అయితే రాహుల్ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ కనబడలేదు. దాంతో కాంగ్రెస్ వైఖరిపై కేజ్రీవాల్ లో అసహనం పెరిగిపోతోంది.

దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మొన్ననే బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో అన్నీపార్టీల అధినేతలు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.

అయితే తర్వాత జరిగిన మీడియా సమావేశాన్ని కేజ్రీవాల్ బహిష్కరించారు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను హరించేట్లుగా నరేంద్రమోడీ పార్లమెంటులో బిల్లు తేబోతున్నారు. దానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాడుతున్నారు.

తన పోరాటంలో కాంగ్రెస్ మద్దతు పలకలేదని, తన వైఖరిని స్పష్టంచేయలేదన్నది కేజ్రీవాల్ కోపం. నిజానికి ఢిల్లీ అంశం కూడా చాలా కీలకమైనదనే చెప్పాలి. ఇపుడు అవసరం కేజ్రీవాల్ కు ఎక్కువగా ఉంది. ఎలాగంటే రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే మోడీ బిల్లు ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్ సభలో ఓకేకానీ రాజ్యసభలో బిల్లు గెలవటం అంత సులభంకాదు. ఒకవేళ బిల్లు ఇక్కడ కూడా పాసైతే కేజ్రీవాల్ న్యాయపోరాటం చేయాల్సిందే.

కాబట్టి సహచర పార్టీలతో మంచిగా ఉండటం ఇపుడు కేజ్రీవాల్ కు తక్షణావసరం. అయితే కొంచెం కూడా ఓపికలేనట్లుగా కేజ్రీవాల్ పాట్నాలో జరిగిన మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనేదిలేదని తెగేసిచెప్పి ఢిల్లీకి చేరుకున్నారు. దాంతో రాహుల్ బాగా హర్టయ్యారు.

కాంగ్రెస్ మద్దతుకోరుతు భేటీకి ముందో తర్వాతో డైరెక్టుగా రాహుల్ లేదా మల్లికార్డున ఖర్గేతో సమావేశమయ్యుండచ్చు. తన తరపున నితీష్ లేదా మరొక నేతను రాయబారం చేయమని అడిగుండివచ్చు.

అలాంటిది ఏమీ చేయకుండానే మీడియా సమావేశాన్ని బహిష్కరించటం తప్పు. ఆ తప్పును దిద్దుకోవటానికి ఇపుడు రాహుల్ ను టీ భేటీకి పిలిచారు. అప్పుడు ఓవర్ యాక్షన్ చేయటం ఎందుకు, ఇపుడు అవస్తలు పడటం ఎందుకు ?