Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ దెబ్బ‌కు వ‌ణుకుతున్న బీజేపీ.. ఎక్క‌డంటే!

By:  Tupaki Desk   |   19 Sep 2022 2:30 AM GMT
కేజ్రీవాల్ దెబ్బ‌కు వ‌ణుకుతున్న బీజేపీ.. ఎక్క‌డంటే!
X
ఆ.. ఆయ‌న వ‌ల్ల ఏమ‌వుతుందిలే అని గ‌తంలో అనుకున్న కాంగ్రెస్‌కు చుక్క‌లు చూపించాడు.. రెండురాష్ట్రాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. రెండు చోట్లా అధికార చ‌క్రం తిప్పుతున్నాడు. ఆయ‌నే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఢిల్లీ స‌హా.. పంజాబ్‌లో అధికారాన్ని ద‌క్కించుకున్న ఆప్‌.. అధినేత‌.. ఇప్పుడు ఏకంగా ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌పై గురి పెట్టారు. ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ గెలిచి.. మోడీకి షాకివ్వాల‌నేది కేజ్రీవాల్ ల‌క్ష్యం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు వ‌రాల జ‌ల్లులు.. హామీల వ‌ర్షాలు కురిపిస్తున్నాయి. దీంతో బీజేపీ త‌ర్జ న భ‌ర్జ‌న ప‌డుతోంది.

గుజరాత్.. భారతీయ జనతా పార్టీకి కంచుకోట.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత గడ్డ. 1995వ సంవత్సరం నుంచి రాష్ట్రం.. బీజేపీ పాలనలోనే ఉంది. ఈ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన మోడీ.. దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఏ విధంగా చూసినా ఈ రాష్ట్రం బీజేపీకి చాలా కీలకం. 2022 చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. గతంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండగా.. ఈసారి కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో నిలిచింది. ఇక్కడే బీజేపీకి ఈ పార్టీ పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఉచిత హామీలు ఇవ్వ‌డానికి బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. అయితే.. అదేస‌మ‌యంలో అనేక ఉచిత పథకాలు ప్రకటిస్తూ ఆప్ అధినేత కేజ్రీవాల్‌ దూసుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ కురిపించే ఉచితాల జల్లుకు గుజరాతీలు జై కొడతారా? రాష్ట్ర ఓటర్లు ఎటువైపు నిలుస్తారు? ఆప్ ఉచితాల ట్రాప్లో బీజేపీ పడుతుందా? అనేది దేశ‌వ్యాప్తంగ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది.

ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్రంలో ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల హీట్ మొదలైంది. పంజాబ్లో గ్రాండ్ విక్టరీతో మంచి జోష్లో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్పై దృష్టి పెట్టారు. అనేక ఉచిత హామీలను ప్రజలపై కురిపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఉచిత హామీని ఇస్తున్నారు. పేదలకు ఉచితంగా విద్య, ఆరోగ్యం, కరెంట్ ఇవ్వలేని బీజేపీని గద్దె దించాలని ప్రజలను కోరుతున్నారు.

ఇక‌, కేజ్రీవాల్ ఉచితాలపై బీజేపీలోనూ అంతర్గతంగా ఆలోచన మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్, ఢిల్లీల్లో ఇదే తరహా హామీలను ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకు న్నారు. సుమారు రెండు దశాబ్దాలకుపైగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం వంటివి బీజేపిని ప్రధానంగా ఇబ్బందిపెట్టే సమస్యలు. దీనికి తోడు కేజ్రీవాల్ కురిపిస్తున్న ఉచిత తాయిలాలకు ప్రజలు ఓ మేర ప్రభావితమవుతారోనని బీజేపీలో ఆలోచన మొదలైంది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

ఆప్ హామీలు ఇవే..
300 యూనిట్ల ఉచిత విద్యుత్‌
ప్ర‌భుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య
నిరుద్యోగ భృతి
మహిళలకు రూ.1,000 భృతి
కొత్త న్యాయవాదులకు నెలవారీ భృతి
రైతులకు కనీస మద్దతు ధర
రైతులకు 12 గంటల నాణ్యమైన కరెంట్