Begin typing your search above and press return to search.

పవన్ కోసం రంగంలోకి ఢిల్లీ పెద్దలు ?

By:  Tupaki Desk   |   23 March 2023 8:59 AM GMT
పవన్ కోసం రంగంలోకి ఢిల్లీ పెద్దలు ?
X
ఏపీలో బీజేపీ జనసేనల మధ్య ఏముంది అంటే పొత్తు అని అంటారు. కానీ నిజానికి పొత్తు లేదు ఎత్తూ లేదు అన్నది అందరికీ తెలుసు. అయితే ఎవరూ ఇప్పటిదాకా ఆ మాటను బాహాటంగా ఒప్పుకోవడంలేదు. పొత్తు పెటాకుల దిశగా సాగుతున్నా అంతా ఎవరికి వారుగా మేము దోస్త్లమే అని చెప్పుకొస్తున్నారు. చిత్రమేంటి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వకుండా ప్రకటన చేశాక కూడా బీజేపీ పవన్ మాకు మిత్రుడే అని నిన్నటిదాకా అంటూ వచ్చారు.

ఇపుడు వారిలో ఒక్కసారిగా ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. పవన్ టీడీపీ వైపు వడివడిగా సాగుతూంటే ఆయన మావాడే అని చెప్పుకుంటూ ఎంతకాలం ఈ ఆత్మవంచన అన్నది ఏపీ బీజేపీ నేతలలో బయల్దేరింది. అందుకే ఉత్తరాంధ్రా మాజీ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్ అయితే ఉన్న మాటను బయటకు కక్కేశారు. పొత్తు ఉందా లేదా అన్నది అర్ధం కావడం లేదు అన్నారు. పొత్తు ఉంటే తాము కోరి అడిగినా పవన్ మద్దతు ఇవ్వాలి కదా అంటూ మాధవ్ తన బాధను చెప్పేశారు.

ఇక బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే నర్మగర్భంగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. కేంద్రంలో మోడీ పాలన బాగుందని, ఆయనతో మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకుంటున్న వారు ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్నారు అంటూ సోము కామెంట్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది పవన్ మీదనేనా అన్న చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉందనగా తమ తోవ తాము చూసుకోవాలని అనుకుంటోంది అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం మాత్రం ఏపీ బీజేపీ నేతల ప్రకటనలతో అలెర్ట్ అయింది అని అంటున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ణి అలా వదిలేయకూడదు అన్నదే కేంద్ర పెద్దల ఆలోచన అంటున్నారు. గత ఏడాది నవంబర్ లో విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఆ వివరాలు బయటకు రాకపోయినా మోడీ మీద పవన్ కి గౌరవం ఉండబట్టే పిలిస్తే వచ్చి హాజరయ్యారు అని అంటున్నారు.

ఇపుడు కూడా ఆ గౌరవాన్ని మొహమాటాన్ని ఆధారం చేసుకుని పవన్ మనసులో ఏముందో సూటిగా తెలుసుకుని తమతో కలుపుకుని పోవాలని కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో ఎదగాలని బీజేపీ భావిస్తోంది. పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ ఈ వదిలిపెట్టాలనుకోవడం ఏ మాత్రం తగని రాజకీయమని కేంద్ర పెద్దలు భావిస్తున్నారుట. పవన్ ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ దిశగా ఏపీ బీజేపీలో మార్పు చేర్పులు చేయడానికి కూడా రెడీ అవుతారు అని అంటున్నారు.

ఇక పవన్ సైతం ఏనాడు మోడీని ఏమీ విమర్శించలేదు. పైగా మోడీ అంటే తనకు ఎంతో గౌరవం అని ఆయన పలు మార్లు చెప్పుకున్నారు. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు కనుక రంగంలోకి దిగితే పవన్ కళ్యాణ్ మెత్తబడతారా. జనసేన నేతలు కోరుకున్నట్లుగా ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ పేరుని ప్రకటిస్తారా. ఆయన కోరిన వారికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించి మొత్తం కూటమిని లీడ్ చేసే బాధ్యతలను ఆయంకు ఇస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ కోరినవి అన్నీ బీజేపీ పెద్దలు చేయడానికి ఇష్టపడితే ఆయన టీడీపీని వీడి బీజేపీతో ఉంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది.

అయితే ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తాను ఇక మీద ఏ రకమైన ప్రయోగాలు చేయడానికి ఇష్టపడను అని తేల్చి చెప్పేశారు. తాను తనతో పాటు జనసైనికులు ఈసారి అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని ఆయన అంటున్నారు. అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం కనుక రంగంలోకి దిగి పూర్తి భరోసా ఇస్తే పవన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా కేంద్ర బీజేపీ నేతలు కనుక పవన్ కోసం వస్తే ఏపీ రాజకీయాల్లో పవన్ డిమాండ్ బాగా పెరుగుతుంది. అపుడు తెలుగుదేశం కూడా ఆయన కోరిన సీట్లను ఇచ్చేందుకు సైతం ఓకే చెబుతుందా అన్న చర్చ కూడా మరో వైపు ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.






నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.