9 గంటల నాన్ స్టాప్ కేబినెట్ భేటీలో కేసీఆర్ నిర్ణయిలు ఇవే

Tue Jan 18 2022 12:10:24 GMT+0530 (IST)

decisions of KCR cabinet meeting

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అంటే.. గంట.. లేదంటే రెండు గంటలు. మహా అయితే మూడు గంటలు. ఎంతో ఇష్టంగా వెళ్లే సినిమాను సైతం గంట కాగానే.. ఒక బ్రేక్ ఇవ్వకపోతే ఆ వినోదాన్ని ఎంజాయ్ చేయటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలాంటిది.. కేబినెట్ భేటీని ఏకంగా తొమ్మిది గంటల పాటు నిర్వహించటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. మామూలుగా అయితే.. ఇంత సుదీర్ఘంగా కేబినెట్ భేటీని నిర్వహిస్తే.. బయటకు వచ్చిన తర్వాత మంత్రివర్గానికి చెందిన కొందరైనా సరే.. ముఖ్యమంత్రి తమను టార్చర్ పెడుతున్నట్లుగా మీడియాకు లీకులు ఇచ్చి మరీ.. తాటాకులు కట్టేస్తుంటారు.అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ విషయంలో కనిపిస్తుంది. మీకు తొమ్మిది గంటలుగాఅనిపిస్తుంది కానీ.. మేం సమావేశ మందిరంలోకివెళ్లిన తర్వాత టైం తెలీలేదని.. అన్నేసి గంటల కూర్చోవటం వల్ల బాత్రూం ఇబ్బంది తప్పించి మరింకేమీ అనిపించలేదన్న మాట కొందరి మంత్రుల నోట రావటం చూస్తే.. కేసీఆర్ మాటల మాయాజాలానికి అబ్బురపడాల్సిందే. అంతేకాదు.. మరో విలక్షణమైన గుణం కేసీఆర్ లో ఉంటుందని చెబుతారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడో కానీ పెట్టకపోవట.. పెట్టిన టైంలో అన్ని విషయాల గురించి కూలంకుషంగా మాట్లాడటం లాంటివి చేస్తారంటారు.  

దాదాపుగా వన్ సైడ్ బ్యాటింగ్ ఉంటుందని.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ మాటలకు ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉంటుందని చెబుతారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీని ఏకంగా తొమ్మిదిగంటల పాటు నిర్వహించిన కేసీఆర్ వైఖరి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేబినెట్ భేటీలో సర్కారు స్కూళ్లలో అంగ్ల విద్యా బోధన.. స్కూళ్లు.. కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టంతో పాటు.. మహిళా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు.. మరిన్ని అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. అవేమిటన్నది చూస్తే..

-  ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యా శాఖలో ‘మన ఊరు - మన బడి’ అనే వినూత్న కార్యక్రమానికి క్యాబినెట్ ఆమోదం.

-  పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘మన ఊరు - మన బడి’ ప్రణాళికకు ఓకే.

-  ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌గా చేపట్టి మూడు దశల్లో మూడేళ్ల వ్యవధిలో విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి.

-  మునిసిపల్ పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి.

-  వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై చర్చ. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావొచ్చింది.అయితే.. అకాల వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోంది.  ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేంత వరకు కేంద్రాలను కొనసాగించాలి. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి.

-  సిద్దిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో బీఎస్సీ ఫారెస్ర్టీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం.

-  అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్‌స్ట ఉద్యోగాల్లో 25 శాతం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల్లో 50 శాతం ఫారెస్టర్ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

-  ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్-1997 తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2000లో సవరణలు చేపట్టాలని తీర్మానం.

-  తెలంగాణలో ‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు నిర్ణయం

-  సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపా్‌సపల్లి జలాశయం వరకు లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు ఆమోదం.

-  సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి పాల్కేడ్ మండలం గుండెబోయినగూడెం గ్రామం వద్ద జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.16.23 కోట్లకు మంత్రివర్గం ఆమోదం.

-  వనపర్తి గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.27.36 కోట్లతో పరిపాలనా అనుమతులకు మంత్రి వర్గం ఓకే.

-  వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామంలోని పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం ఓకే.

-  మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన ఘన్‌పూర్ బ్రాంచి కాలువ పనుల కోసం రూ.144.43 కోట్లకు ఆమోదం. దీంతో 25 వేల ఎకరాలకు సాగునీరు.

-  ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా-కొరాటా బ్యారేజీకి సంబంధించి రూ.795.94 కోట్ల అంచనా వ్యయాన్ని సవరించడానికి ఆమోదం. దీంతో 50 వేల ఎకరాలకు సాగునీరు.

-  మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్‌పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునికీకరించగా.. మిగిలిపోయిన మరికొన్ని పనులు చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం.

-  వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని గోపాలసముద్రం చెరువు పునరుద్ధరణ సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు.

-  గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి.

-  సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు నిధుల సేకరణ కోసం కంపెనీస్ యాక్ట్-2013 కింద మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదం.

-  దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్.. కాలువ పనులకు ఓకే. రూ.104.92 కోట్లకు ఆమోదం