Begin typing your search above and press return to search.

అప్పుల్లోనూ అంబానీలది టాప్‌ ప్లేసే!

By:  Tupaki Desk   |   26 Nov 2017 12:00 PM GMT
అప్పుల్లోనూ అంబానీలది టాప్‌ ప్లేసే!
X
దేశంలో అత్యంత సంప‌న్న కుటుంబం ఏది? అంటే... స‌మాధానం చెప్పేందుకు సింగిల్ సెకండ్ కూడా వేచి చూడాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ఏటా ఈ జాబితాలో ఒక్క‌రే నిలుస్తూ వ‌స్తుంటే... ఆయ‌న పేరును మ‌రిచిపోవ‌డం అసాధ్య‌మే క‌దా. అందుకే భార‌త శ్రీమంతుడు ఎవరంటే... ముఖేశ్ అంబానీ అని ఠ‌క్కున చెప్పేస్తాం. రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ చైర్మ‌న్‌గా ఉన్న ముఖేశ్ అంబానీ ఏటికేడు త‌న ఆస్తుల‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఫ‌లితంగా గ‌డ‌చిన ఏడేళ్లుగా దేశంలో అత్యంత ధ‌నికుడిగా ఆయ‌న పేరు మారుమోగిపోతోంది. త‌న‌దైన మార్కు బిజినెస్ వ్యూహాలతో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయ‌న రూ.6 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచేశారు.

ఇక ముఖేశ్ సోద‌రుడు అనిల్ అంబానీ విష‌యానికి వ‌స్తే... తండ్రి నిర్మించిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ను పంచేసుకున్న తర్వాత అనిల్ ఏటికేడు తీసిక‌ట్టుగానే మారిపోతున్నారు. అన్న పైపైకి ఎదుగుతుంటే... త‌మ్ముడు మాత్రం దిగ‌జారిపోతున్నారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ వేరు కాపురాలు పెట్టేసి ఇప్ప‌టికే 11 ఏళ్లు పూర్తి అయిపోయింది. వేరు ప‌డిన త‌ర్వాత తొలి నాళ్ల‌లో అన్న‌కు ధీటుగా రాణించిన అనిల్.. ఆ త‌ర్వాత ఎందుక‌నో అంత‌గా రాణించ‌లేక‌పోయారు. రాణించ‌లేక‌పోయార‌నే కంటే కూడా ఉన్న వ్యాపారాన్ని కూడా కాపాడుకునే దిశ‌గా అనిల్ పెద్ద‌గా స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నా గ‌డ‌చిన ఐదేళ్లుగా అనిల్ మ‌రింత‌గా దిగ‌జారిపోతే... ముఖేశ్ గ్రాఫ్ కూడా క్ర‌మంగా ప‌డిపోతున్న సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

అయినా ఏటికేడు సంప‌ద‌ను పెంచుకుంటూ పోతున్న ముఖేశ్ గ్రాఫ్ ప‌డిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... రిల‌య‌న్స్ ను ముఖేశ్ చేతుల్లోకి వెళ్లే నాటికి ఆ సంస్థ రుణం మొత్తం ల‌క్ష కోట్ల రూపాయ‌ల్లోపే ఉండేది. అయితే గ‌డ‌చిన ఐదేళ్ల‌లో ఈ రుణం మొత్తం రూ.1.96 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరిపోయింది. అంటే రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అప్పుల‌ను త‌గ్గించాల్సింది పోయి ముఖేశ్ వాటిని డ‌బుల్ చేసేశార‌న్న మాట‌. అయితే అప్పును డ‌బుల్ చేసినా... రిల‌య‌న్స్ ఇంట‌రెస్ట్ క‌వ‌ర్ రేషియో మాత్రం ప‌డిపోకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. ఇక అనిల్ కంపెనీల విష‌యానికి వ‌స్తే... ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని ప‌లు కంపెనీల మొత్త రుణ భారం ల‌క్ష కోట్ల రూపాయ‌లు దాటి పోయింది. మ‌రో వైపు ఆర్ కామ్ డాల‌ర్ బాండ్ పేమంట్ల చెల్లింపుల్లో చ‌తికిల బ‌డిపోయింది. వెర‌సి సోద‌రుడి కంటే తక్కువ అప్పుల్లోనే ఉన్న అనిల్ త‌న కంపెనీల ఇంట‌రెస్ట్ కవ‌ర్ రేషియోను మాత్రం కాపాడుకోలేక‌పోయారు. మొత్తంగా చూస్తే... ఇద్ద‌రు సోద‌రులు అప్పుల్లో నువ్వా, నేనా అన్న రీతిన ముందుకు సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.