Begin typing your search above and press return to search.

అనుమానాస్పద స్థితిలో సస్సెండెడ్ ఎమ్మార్వో మృతి

By:  Tupaki Desk   |   3 Sep 2022 11:32 AM GMT
అనుమానాస్పద స్థితిలో సస్సెండెడ్ ఎమ్మార్వో మృతి
X
రెండేళ్ల క్రితం భూ కుంభకోణంలో అరెస్టయి సస్పెండ్ అయిన తెలంగాణ ప్రభుత్వ అధికారి శనివారం ఇక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఖరీదైన షేక్‌పేట మండల మాజీ రెవెన్యూ అధికారి (ఎంఆర్‌వో) సుజాత మృతి చెందడం అనుమానాలకు కారణం అవుతోంది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు.

2020లో ఎమ్మార్వో సుజాత ఓ భూదందా కేసులో అరెస్టయిన తర్వాత ఆమె భర్త దీన్ని జీర్ణించుకోలేక భవనంపై నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు సుజాత అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసులో ఏదైనా మతలబు ఉందా? అని అందరూ ఆరాతీస్తున్నారు. సుజాత డెంగ్యూతో బాధపడుతూ చికిత్స పొందుతోందని.. గుండెపోటుతో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

సుజాత భర్త అజయ్ కుమార్ ఈ కేసులో ఆయనను కూడా అధికారులు విచారించడంతో మనస్థాపం చెంది 2020 జూన్ 17న చిక్కడపల్లిలో తన సోదరి నివాసం ఉంటున్న ఐదంతస్తుల నివాస భవనం టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఉస్మానియా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. భూ కుంభకోణంలో సుజాత అరెస్టయి జైలుకు పంపబడిన కొద్ది రోజులకే అజయ్ మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

జూన్ 8, 2020న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 4,865 చదరపు గజాల భూమికి సంబంధించిన అవినీతి ఫిర్యాదుకు సంబంధించి అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) సుజాతను అరెస్టు చేసింది. గాంధీనగర్‌లోని సుజాత ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించగా బంగారు ఆభరణాలు, రూ.30 లక్షల నగదు లభించింది. ఆమె గతంలో అంబర్‌పేట, ముషీరాబాద్‌ మండలాల ఎంఆర్‌వోగా పనిచేశారు.

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు సయ్యద్ అబ్దుల్ ఖలీద్ ఫిర్యాదు మేరకు ఈ కేసులో బంజారాహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. రవీంద్ర నాయక్ రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకొని సస్పెండ్ చేసింది. ఖలీద్ నుండి రూ.3 లక్షలు డిమాండ్ చేసి అందులో సగం తీసుకున్నందుకు ఆర్ఐ నాగార్జునరెడ్డిని కూడా ఎసిబి అరెస్టు చేసింది.

ఖలీద్ తన తండ్రి 1969లో కొనుగోలు చేసిన భూమిని సర్వే చేసి రికార్డులను అప్‌డేట్ చేయాలని ఎమ్మార్వోను అభ్యర్థించాడు. మార్కెట్‌లో భూమి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. ఖలీద్ ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని సుజాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తర్వాత సమస్య పరిష్కారం కోసం ఖలీద్ స్వయంగా సుజాతను సంప్రదించగా, ఆమె రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేసిందని.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డికి తీసుకోవాలని సూచించింది. ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేసి నాగార్జున రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ కేసులో ఎంఆర్‌ఓ సుజాత, బంజారాహిల్స్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వారిద్దరినీ సస్పెండ్ చేశారు. అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న ఎమ్మార్వో తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనమైంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.