Begin typing your search above and press return to search.

అనూహ్య హంతకుడికి ఉరి

By:  Tupaki Desk   |   30 Oct 2015 8:28 AM GMT
అనూహ్య హంతకుడికి ఉరి
X
మచిలీపట్నానికి చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్ కు ఉరిశిక్ష పడింది. ముంబై లో జరిగిన ఈ ఘోరంపై అక్కడి కోర్టు శుక్రంవారం ఈ మేరకు తీర్పును వెలువరించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్ కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభానుకు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. అంతకు ముందే చంద్రభాన్ ను దోషిగా తేల్చగా.. తాజాగా ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తన కూతురిని శవంగా మార్చిన మృగానికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై అనూహ్య తండ్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ముంబైలో టీసీఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసే అనూహ్య.. తన తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్ జరుపుకోడానికి తమ సొంతూరు కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చింది. తిరిగి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అదృశ్యమైంది. ఎల్‌ టీటీ స్టేషన్‌ లో రైలు దిగిన ఆమెకు టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెపై అత్యాచారం చేసి హతమార్చాడు. కుళ్లిపోయిన ఈమె మృతదేహం అదే నెల16వ తేదీన భాండుప్‌ లోని ఈస్టర్న్ ఎక్స్‌ ప్రెస్ వే సమీపంలో దొరికింది. అనూహ్య నుంచి దొంగిలించిన బ్యాగ్ - దుస్తులు - ఐడీ కార్డు తదితరుల వస్తువుల ఆచూకీని పోలీసులు గుర్తించగలిగారు. వాటిలో లభించిన డీఎన్‌ ఏ నమూనాల ద్వారా నిందితుడు చంద్రభాన్ అని నిర్ధారించారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ కేసు విచారణ సాగింది. 1300 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. చివరకు నిందితుడు చంద్రభాన్‌ ను దోషిగా నిర్ధారించారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వాద‌న‌తో ఏకీభ‌వించిన న్యాయ‌మూర్తి ఈ కేసులో దోషి చంద్రభాన్ కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.