Begin typing your search above and press return to search.

కేసీఆర్‌.. స‌బిత‌ల మ‌ధ్య డీల్ ఇదేనా?

By:  Tupaki Desk   |   13 March 2019 5:11 AM GMT
కేసీఆర్‌.. స‌బిత‌ల మ‌ధ్య డీల్ ఇదేనా?
X
ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో బ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ నేత‌గా.. చేవెళ్ల చెల్లెమ్మ‌గా సుప‌రిచితురాలు స‌బిత గులాబీ కారు ఎక్కేందుకు డిసైడ్ అయ్యారు. యూట‌ర్న్ ల మీద యూట‌ర్న్ లు తీసుకోవ‌టం.. రాజ‌కీయంగా స‌బిత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న విష‌యమై గ‌డిచిన మూడు నాలుగు రోజులుగా సాగుతున్న ఉత్కంట‌కు ఈ రోజు తెర ప‌డ‌నుంది.

కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌టంతో రంగంలోకి దిగిన మ‌జ్లిస్ అధినేత అస‌ద్ గులాబీ కారు ఎక్కించే దిశ‌గా స‌బిత‌ను సిద్ధం చేశారు. అంత‌లోనే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఫోన్ రావ‌టం.. రాహుల్ నేరుగా మాట్లాడి.. ఆమెకు స‌ర్ది చెప్పిన వైనంతో స‌బిత కారు ఎక్కే విష‌య‌మై వెన‌క‌డుగు వేయాల‌ని భావించారు.

అంత‌లోనే అస‌ద్ మ‌రోసారి ఎంట్రీ ఇచ్చి.. త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోకుండా ఉండేలా స‌బిత‌ను సిద్ధం చేశారు. దీంతో గులాబీ కండువా క‌ప్పుకునేందుకు ఆమె రెఢీ అయ్యారు. ఇంత‌కీ..పార్టీలో చేరుతున్న స‌బిత‌మ్మ‌కు కేసీఆర్ ఇచ్చిన వరాలు ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

కొడుక్కి ఎంపీ సీటు ఇప్పించుకోవటమే స‌బిత లక్ష్య‌మైన‌ప్ప‌టికీ ఆమె అది సాధించుకోలేన‌ట్లు చెబుతున్నారు. ఆమె కోరుకోకుండానే మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేసిన కేసీఆర్‌.. కొడుకు కోసం స‌బిత‌మ్మ అడిగిన ఎంపీ టికెట్ విష‌యంలో మాత్రం కేసీఆర్ కాద‌న్న‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో స‌బిత చిన్న‌బుచ్చుకోకుండా ఉండేలా రాజీ ఫార్ములాను కేసీఆర్ సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

టీఆర్ ఎస్ లో చేరే విష‌య‌మై ఊగిస‌లాట‌లో ఉన్న స‌బిత‌మ్మ‌కు కేసీఆర్ నుంచి వ‌చ్చిన ఒక స్ప‌ష్ట‌మైన హామీతో పార్టీలో చేరేందుకు ఓకే చెప్పేశార‌ని చెబుతున్నారు. త‌న కొడుక్కి ఎంపీ టికెట్ కు నో చెప్పిన కేసీఆర్‌.. ఎమ్మెల్సీ అవ‌కాశం ఇస్తాన‌న్న స్ప‌ష్ట‌మైన హామీకి మెత్త‌బ‌డిన‌ట్లు చెబుతున్నారు. దీంతో.. ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినేత‌తో భేటీ అయ్యేందుకు సిద్ధ‌మైన స‌బిత‌.. అందుకు భిన్నంగా త‌న ఢిల్లీ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. కారెక్క‌టానికే రెఢీ అయ్యారు.