స్ట్రెచర్ మీద శవం.. ఆ పక్కనే కరోనా టెస్టులు..

Tue Apr 20 2021 06:36:28 GMT+0530 (IST)

dead body on stretcher Corona tests next to it ..

దారుణం.. దుర్మార్గం లాంటి మాటలు అస్సలు పనికి రావు. మానవత్వం చచ్చిపోయి.. మెకానికల్ గా మాత్రమే పని చేయటం.. ఉద్యోగం అంటే డబ్బులు సంపాదించటం తప్పించి.. మరింకేమీ కాదన్న రీతిలో ఉండే ఈ వైనం గురించి తెలిస్తే.. దేవుడా అనుకోకుండా ఉండలేరు. నిర్లక్ష్యానికి పరాకాష్ఠంగా మారిన ఈ ఉదంతం హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఒక స్ట్రెచర్.. దాని మీదో శవం. పూర్తిగా ప్యాక్ చేసేసి.. నాలుగు రోజులు అవుతున్నా పట్టించుకోని దారుణం.కుళ్లిపోయి.. దారుణమైన దుర్వాసన రావటంతో సిబ్బందికి తెలివి వచ్చి.. అప్పటికప్పుడు అంత్యక్రియులు నిర్వహించిన దైన్యం చూస్తే.. మనిషీ.. నీకేమైందని అనుకోకుండా ఉండలేం. ఇంతకీ ఈ ఉదంతం మరెక్కడో కాదు.. హైదరాబాద్ లోని  కింగ్ కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కోవిడ్ కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రిలో దాదాు 400 పడకల సామర్థ్యం ఉంది. ఇదే ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుంటారు.

ఇదిలా ఉంటే.. కాచిగూడాలోని ఒక హాస్ట్ లో శ్రీనివాస్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ఉండేవాడు. అనాథగా చెబుతున్న ఇతన్ని ఈ నెల 14న కరోనా సోకటంతో ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి 16న మరణించాడు. దీంతో.. సిబ్బంది శ్రీనివాస్ డెడ్ బాడీని ప్యాక్ చేసి.. అంత్యక్రియల కోసం అట్టి పెట్టేశారు. నిబంధనల ప్రకారం.. ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం దహన సంస్కారాలు నిర్వహిస్తుంది. సిబ్బందికి పట్టిన నిర్లక్ష్యం.. బాధ్యతల్ని మర్చిపోయేలా చేసింది.

 స్ట్రెచర్ మీద నాలుగు రోజులుగా డెడ్ బాడీ ఉండిపోయింది. సోమవారం దర్వాసన పెద్ద ఎత్తున రావటంతో.. మేల్కొన్న అధికారులు అప్పటికప్పుడు సిబ్బందిని పిలిపించి.. దహనసంస్కారాల్ని పూర్తి చేశారు. ఈ నాలుగు రోజులు స్ట్రెచర్ మీద ఉన్న ఆ డెడ్ బాడీ పక్కనే.. కరోనా టెస్టులు జరగటం.. క్యూలో అక్కడ చాలామందినిలబడటం గమనార్హం. దుర్వాసన వస్తున్నా.. ఆసుపత్రి కావటంతో సర్దుకుపోయారు. ఇంతటి దుర్మార్గాన్ని ఏమనాలి? ఎవరిని బాధ్యుల్నిచేయాలి? ఎలాంటి శిక్ష విధించాలి?