Begin typing your search above and press return to search.

కొత్త సచివాలయం ఓపెనింగ్ కు డేట్ డిసైడ్.. తెర మీదకు 'ఆరు' సెంటిమెంట్

By:  Tupaki Desk   |   26 April 2023 12:02 PM GMT
కొత్త సచివాలయం ఓపెనింగ్ కు డేట్ డిసైడ్.. తెర మీదకు ఆరు సెంటిమెంట్
X
తాను అనుకున్నది చేసే వరకు నిద్ర పోని లక్షణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్.. సచివాలయంలో ఆయనకు ఏదో అనిపించటం.. అప్పటి నుంచి సచివాలయానికి వెళ్లకుండా ఉండటం తెలిసిందే.

పాత దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవటం.. అందుకు తగ్గట్లే వందల కోట్ల ఖర్చుతో భారీగా నిర్మించిన సచివాలయం సిద్ధమైంది. ఆదివారం (ఏప్రిల్ 30న) మధ్యాహ్న వేళ సచివాలయాన్ని ఓపెన్ చేసేందుకు ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. దానికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది.

ఆదివారం మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్యలో అన్ని శాఖలకు చెందిన అధికారులు తమ కుర్చీల్లో కూర్చోవటంతో పాటు.. ప్రతి ఒక్కరు కనీసం ఒక్క ఫైలు మీదనైనా సరే సంతకం చేసేలా సిద్ధం కావాలని పేర్కొనటం గమనార్హం. 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య ఉండే ఆరు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులు తమ ఫైళ్ల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు 'ఆరు' కు ఉన్న లంకె గురించి అందరికీ తెలిసిందే.

ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచే సచివాలయ ప్రారంభోత్సవ పూజలు.. హోమాలు సాగనున్నాయి. ఈ పూజల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు అధికారులు హాజరు కానున్నారు. సచివాలయ ప్రాంగణంలో చేయబోయే సుదర్శన యాగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో పూజా కార్యక్రమాల్ని పూర్తి చేస్తారని.. మధ్యాహ్నం 1.10 - 1.20 గంటల మధ్యలో సచివాలయాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి తన ఛాంబర్ లో కొలువు తీరిన తర్వాత మంత్రులు.. సీఎంవో కార్యదర్శలతో సహా ఇతర కార్యదర్శులు తమ ఆఫీసుల్లో కూర్చుంటారని చెబుతున్నారు. మే ఒకటి నుంచి కొత్త సచివాలయంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. బుధవారం నుంచి బీఆర్కే భవన్ కు ఫైళ్లను తరలించే కార్యక్రమాన్ని షురూ చేయనున్నట్లు చెబుతున్నారు.

కొత్త సచివాలయంలో శాఖల వారీగా కొత్త ఫర్నీచర్ ను ఏర్పాటు చేసి ఉండటంతో.. బీఆర్కే భవన్ నుంచి ఎలాంటి ఫర్నీచర్ ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని స్పష్టంగా తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 29 నాటికి అన్ని శాఖల్లోకి సామాగ్రిని తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.