Begin typing your search above and press return to search.

నిజాలు అన్నీ బయటకొస్తాయి... బాంబు పేల్చిన దస్తగిరి

By:  Tupaki Desk   |   17 April 2023 8:07 PM GMT
నిజాలు అన్నీ బయటకొస్తాయి... బాంబు పేల్చిన దస్తగిరి
X
మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య కేసులో అసలు నిజాలు అన్నీ ముందు ముందు బయటకు వస్తాయని ఆయన హత్యలో ప్రధాన నిందితుడు అయిన దస్తగిరి బాంబు పేల్చారు. కడప జిల్లా ఎర్రగుంటలో ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చాలా విషయాలే చెప్పారు. ఆయన అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. తాను పారిపోయానని అంటున్నారని, కానీ ఎక్కడికీ పారిపోలేదని, పులివెందులలోని విజయమ్మ కాలనీలో ఉంటున్నానని ఆయన చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా దస్తగిరి మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలే చెప్పారు. తాను ఇపుడు కడప ఎంపీకి చెడ్డవానిగా కనిపిస్తున్నానని, ఎందుకంటే కేసు ఇపుడు మీ దగ్గరకు వచ్చింది కాబట్టి అని విమర్శించారు. తాను అప్రూవర్ గా మారే సమయంలోనే ఎందుకు అవినాష్ రెడ్డి వ్యతిరేకించలేదని ఆయన నిలదీశారు.

తాను అప్పట్లో ఎర్ర గంగిరెడ్డి చెబితేనే డబ్బుకు ఆశపడి వివేకాను హత్య చేశాను అని దస్తగిరి అన్నారు. తాను చేసిన పాపానికి చింతించి అప్రూవర్ గా మారానని అన్నారు. తనకు ఇపుడు ఒక్క పైసా కూడా డబ్బు అవసరం లేదని అన్నారు. తాను సునీతమ్మ నుంచి కానీ సీబీఐ నుంచి కానీ ఒక్క పైసా కూడా తీసుకోలేదని అలా ఎవరైనా నిరూపిస్తే జీవితాంతం జైలులో ఉండడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ కేసులో తాను చెప్పినవి అన్నీ వాస్తవాలే అన్నారు. తాను అబద్ధాలు చెప్పానని అనడం తప్పు అని ఖండించారు. తమకు పలుకుబడి ఉందని సీబీఐ పాత చీఫ్ రాం సింగ్ ని మార్చారని, కానీ కేసును ఎవరూ మార్చలేరు కాబట్టే కొత్త సీబీఐ చీఫ్ వచ్చినా అదే కేసు సాగుతోందని దస్తగిరి అన్నారు.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని దస్తగిరి అంటున్నారు. అందుకే ఎవరు విచారణ అధికారిగా వచ్చినా కచ్చితంగా ఆయన్నే ప్రశ్నిస్తారని అన్నారు. నిజానికి ఆనాడే ఈ కేసు విషయంలో జగన్ సహకరించి ఉంటే ఏపీలోనే కేవలం పది రోజులల్లోనే విచారణ పూర్తి అయి దోషులు దొరికేవారు అని దస్తగిరి అనడం విశేషం

ఈ కేసు విషయంలో ఇంకా వాస్తవాలు అన్నీ తొందరలోనే బయటకు వస్తాయని దస్తగిరి అనడమూ గమనార్హం. తాను నిజాలు చెబుతున్నానని, అప్రూవర్ గా మారానని చాలా మందికి కోపం ఉందని, ముఖ్యంగా తనకు ప్రాణ హాని ఉందని, జగన్ అవినాష్ రెడ్డిల నుంచే అది ఉందని దస్తగిరి చెప్పడం విశేషం. మొత్తానికి తప్పు చేశానని అందుకే ప్రాయశ్చిత్తం చేసుకున్నా దస్తగిరి అంటూ ఎంతటి పెద్ద వారు అయినా చట్టం ముందుకు రావాల్సిందే అని చెప్పడం బట్టి చూస్తే ఏపీలో రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయమని తెలుస్తోంది.