Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్ ర‌గిలిపోతోంది

By:  Tupaki Desk   |   18 Jun 2017 6:50 AM GMT
ప్ర‌త్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్ ర‌గిలిపోతోంది
X
బెంగాలీ భాష‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ తీసుకున్న నిర్ణ‌యం ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో ఎంతోకాలంగా ఉన్న గూర్ఖా ల్యాండ్ ప్ర‌త్యేక రాష్ట్ర డిమాండ్ తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. ఉద్య‌మం భారీ ఎత్తున మొద‌లైంది. అదే క్ర‌మంలో ఉద్య‌మం అదుపు త‌ప్పి హింస‌కు తెర తీయ‌టం ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీకి ఇబ్బందిక‌రంగా మారింది.

గ‌డిచిన ప‌ది రోజులుగా ర‌గిలిపోతున్న డార్జిలింగ్.. తాజాగా మ‌రింత హింసాత్మ‌కంగా మారింది. సింగ‌మారిలో పోలీసులు.. గూర్ఖా జ‌న‌ముక్తి మోర్చా కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ఒక‌రు మ‌ర‌ణించారు. జూన్ 8న మొద‌లైన ఆందోళ‌న‌ల్లో న‌మోదైన తొలి మ‌ర‌ణంగా దీన్ని చెబుతున్నారు. తాజా హింస‌లో 35 మంది భ‌ద్ర‌తా సిబ్బంది గాయ‌ప‌డ్డారు. వీరిలో ఇండియా రిజ‌ర్వ్ బెటాలియ‌న్ కు చెందిన అధికారిక కిర‌ణ్ త‌మంగ్ స‌హా మొత్తం 19 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో జీజేఎం కార్య‌క‌ర్త‌ల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా ప‌రిణామాల‌తో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. కేంద్ర‌మంత్రిరాజ్ నాథ్ లు రియాక్ట్ అయ్యారు. ప‌రిస్థితిని స‌మీక్షించారు. పోలీసులు.. ఆందోళ‌న‌కారుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో బాంబులు ప్ర‌యోగించ‌టంపై సీఎం మ‌మ‌త ప‌లు సందేహాల్ని వ్య‌క్తం చేశారు. ఇక్క‌రోజులో ఇన్ని ఆయుధాలు.. బాంబులు స‌మ‌కూర్చుకోవ‌టం సాధ్యం కాద‌ని.. ఇదంతా ముంద‌స్తుగా వేసుకున్న ప్ర‌ణాళిక‌లో భాగంగా చేశార‌న్నారు. త‌న ప్రాణం పోయినా ఫ‌ర్లేదు కానీ బెంగాల్‌ను మాత్రం ముక్క‌లు కానివ్వ‌న‌ని మ‌మత పేర్కొన్నారు.

మ‌రోవైపు.. గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ చేప‌ట్టిన ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో డార్జిలింగ్ లోని ప‌లు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమ‌ల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న చేప‌ట్టిన సింగ‌మారిలో ఆందోళ‌న‌కారుల్ని వెన‌క్కి వెళ్లిపోవాల‌ని పోలీసులు కోరారు. దీనికి నిరాక‌రించిన నిర‌స‌న కారుల్ని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించ‌గా.. పోలీసుల‌పై ఆందోళ‌న‌కారులు రాళ్లు.. బాంబులు విసిరారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు
పోలీసులు బాష్ప‌వాయు గోళాల్ని ప్ర‌యోగించారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌నాకారులు పోలీసుల వాహ‌నాన్ని త‌గ‌లబెట్ట‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/