Begin typing your search above and press return to search.

ఈ దేశ అధ్యక్షుడి అతి జాగ్రత్త.. టాక్ అఫ్ ది వరల్డ్ ..!

By:  Tupaki Desk   |   9 April 2021 6:58 AM GMT
ఈ దేశ అధ్యక్షుడి అతి జాగ్రత్త.. టాక్ అఫ్ ది వరల్డ్ ..!
X
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఆయా దేశాలు తమదైన రీతిలో నివారణ పద్ధతులు పాటిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ చర్యలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన కోసం తీసుకునే అతి జాగ్రత్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఓ స్పెషల్ డ్రైవ్ ను అమలుచేస్తున్నట్లు రష్యా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

పుతిన్ ను కలవాలంటే ప్రతి ఒక్కరూ క్వారంటైన్ లో ఉండాల్సిందే. పుతిన్ కు కరోనా వ్యాపించకుండా ఉండేందుకు బడ్జెట్ నుంచి ఆయన డైరెక్టరేట్ ప్రత్యేక నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.618 కోట్లు కేటాయించారని ఆదేశ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. పుతిన్ ను కలిసేవారిని క్వారంటైన్ చేయడం కోసం ఏకంగా 12 హోటళ్లు బుక్ చేశారట. మాస్కో, ఆ పరిసర ప్రాంతాలైన షోచీలో హోటళ్లలో 2022 మార్చి వరకు బుకింగ్స్ నిలిపివేశారట!

ఈ హోటళ్లలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం లేదు. పుతిన్ వ్యక్తిగత కార్యకలాపాలు చూసుకునే డైరెక్టరేట్ కు సంబంధం ఉన్న హోటళ్లనే బుక్ చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రయాణించే ప్రత్యేక విమానం రోసియా సిబ్బందిని ఈ హోటళ్లలో క్వారంటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సిబ్బంది అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రులకు సేవలు అందించనున్నారు. ఇతర ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ సంఖ్యలోనే విమాన సిబ్బందిని క్వారంటైన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

రెండో ప్రపంచ యుద్ధానికి గుర్తుగా జరిపే విక్టరీ డేను గతేడాది జూన్ 24న సాదాసీదాగా జరిపారు. ఆ కార్యక్రమంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు కొందరు పుతిన్ కలిశారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సైనికులకు పుతిన్ పురస్కారాలు అందజేశారు. అయితే ఈ కార్యక్రమం జరగడానికి ముందే సైనికులను క్వారంటైన్ చేసినట్లు అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక జర్నలిస్టులనూ క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఒక్కో జర్నలిస్టును ఒక్కో గదిలో ఉంచుతున్నారు. కనీసం పక్కవారితో మాట్లాడే అవకాశాన్నీ ఇవ్వడం లేదు. పుతిన్ ను నేరుగా కలిసి మాట్లాడడానికి వారికి అనుమతి లేదని అని రష్యా ప్రభుత్వ సమాచార ఏజెన్సీ టాస్, ఆర్ఐఏ-నోవోస్తీ కథనాలు ప్రచురించాయి.

క్వారంటైన్ లో ఉన్నవారికోసం వచ్చే ఆహార పదార్థాలను శానిటైజ్ చేశాకే లోపలికి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. వారుకి మద్యం, పొగతాగడం పూర్తిగా నిషేధం. పుతిన్ కలవడానికి వచ్చిన చిన్న అధికారి సైతం క్వారంటైన్ లోనే ఉండాలి. అయితే నేరుగా అధ్యక్షుడిని కలవకపోయినా, పుతిన్ దగ్గర ఉండే అధికారులను కలవాలన్నా క్వారంటైన్ తప్పనిసరి. 2020 మార్చి 25న జాతినుద్దేశించి పుతిన్ మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్ 1ని 'నాన్ వర్కింగ్ వీక్‌' ప్రారంభంగా భావిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత ఆ దేశంలో లాక్డౌన్ విధించారు.

అత్యవసరం కాని దుకాణాలు మూసేశారు. పుతిన్ షోచీలోని ఆయన నివాసం నుంచే పని చేశారు. ఆయన కోసం వచ్చే వారిని అప్పటి నుంచి ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అది మరికొన్నాళ్ల పాటు కొనసాగవచ్చు. పుతిన్ ను రక్షించడం కోసమే ఈ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కరి కోసం ఇంత అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పుతిన్ ది అతి జాగ్రత్తనేనని.. మరి తమ పరిస్థితి ఏంటని సామాన్యులు అనుకోవడం గమనార్హం.