Begin typing your search above and press return to search.

భారత్ ను వణికిస్తున్న ఆ రెండు రాష్ట్రాలు

By:  Tupaki Desk   |   29 Jan 2021 4:10 AM GMT
భారత్ ను వణికిస్తున్న ఆ రెండు రాష్ట్రాలు
X
కరోనాను ప్రపంచం నుంచి గెంటసే రోజులు దగ్గరకు వచ్చినట్లే. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సినేషన్ పుణ్యమా అని.. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మెరుగుదల ఏర్పడుతోంది. అయితే.. పలు దేశాల్లో మాత్రం పరిస్థితి పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. అమెరికాతో పాటు.. మరికొన్ని దేశాల్లో కరోనా తీవ్రత ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే.. భారత్ మాత్రం కాస్త భిన్నమని చెప్పాలి. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్ మెరుగైన పరిస్థితుల్లో ఉందని చెప్పాలి.

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే.. అత్యధిక కేసులు ఆ రెండు రాష్ట్రాలకు చెందినవే అన్న విషయాన్ని గుర్తించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1.73లక్షల యాక్టివ్ కేసులు ఉంటే.. ఇందులో 65 శాతం కేసులు రెండు రాష్ట్రాలకు చెందినవి కావటం విశేషం. కేరళలో 72,476 యాక్టివ్ కేసులు ఉంటే..మహారాష్ట్రలో 44,624 కేసులు నమోదయ్యాయి.

కేసుల నమోదు తగ్గుముఖం పట్టినట్లే.. మరణాలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. దేశంలో రోజువారీగా 125 మంది కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 8 నెలల్లో ఇంత తక్కువగా మరణాలు నమోదు కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 19.4 కోట్ల శాంపిల్స్ ను పరీక్షించారు. ఇందులో 1.07కోట్ల మందికి వైరస్ సోకింది. వీరిలో 1.03కోట్ల మంది కోలుకున్నారు. అంటే..96.94 శాతం మంది ఆరోగ్యవంతంగా ఆసుపత్రుల నుంచి..ఇళ్లలోనూ కరోనా బారి నుంచి బయటపడ్డారు. 1.53లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు