Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాలకు డేంజర్‌ బెల్స్‌!

By:  Tupaki Desk   |   14 March 2023 7:00 PM GMT
రెండు రాష్ట్రాలకు డేంజర్‌ బెల్స్‌!
X
మనదేశంతోపాటు ప్రపంచ దేశాలను కోవిడ్‌ మహ్మమారి అల్లకల్లోలం చేసింది. దాని దుష్ప్రభావాల నుంచి ఇంకా ప్రజలు తేరుకోలేదు. ఇప్పుడు ఇన్‌ ప్లూయెంజా రూపంలో మరో వైరస్‌ మనదేశంపైన విరుచుకుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో ఈ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలం పోయి వేసవి కాలం వస్తున్నా ఇంకా దగ్గు, జలుబు, జ్వరం దీర్ఘకాలం పాటు వ్యాధిగ్రస్తుల్లో ఉండటం కలవరం రేపుతోందని అంటున్నారు.

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ఎ–రకం వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఏపీ, తెలంగాణలోనే కాకుండా మనదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కూడా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రజా సమూహాలకు దూరంగా ఉండాలని, కోవిడ్‌ కు ఎలాంటి జాగ్రత్తలు పాటించారో అలాంటి జాగ్రత్తలే పాటించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం, ఆలింగనం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది. అలాగే బహిరంగంగా ఉమ్మడం చేయరాదని సూచించింది. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వెల్లడించింది. జ్వరం, దగ్గు, జలుబు తగ్గకపోతే సొంత వైద్యం చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించాలని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

మరోవైపున తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ వేగంగా వ్యాపించేందుకు ఆస్కారముందని అంటున్నారు. చాలామంది మాస్కులు వాడటం లేదని చెబుతున్నారు. ఎంతకూ విడవని దగ్గు, జలుబు, జ్వరం ఉంటున్నా సాధారణ ప్లూ అని ప్రజలు లైట్‌ తీసుకుంటున్నారని.. ఇదే ప్రమాదం పెంచుతోందని పేర్కొంటున్నారు.

కరోనా కేసులు తగ్గిన తర్వాత భారత్‌ లో హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైందని గణాంకాలు సైతం చెబుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ప్రధాని మోడీ ఇటీవల ఇన్‌ ప్లూయెంజా వైరస్‌ ను నియంత్రించడానికి సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 21 హెచ్‌3ఎన్‌2 ఇన్‌ ప్లూయెంజా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలోని వీఆర్‌డీఎల్‌ లో నిర్వహించిన పరీక్షల్లో జనవరిలో 12, ఫిబ్రవరిలో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు తెలంగాణలో కేసులు మరింత పెరిగిన పక్షంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రక్తనమూనాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ కు పంపిస్తున్నట్టు ఫీవర్‌ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఫీవర్‌ ఆసుపత్రితో పాటూ వరంగల్, ఆదిలాబాద్‌ లోనూ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇన్‌ ప్లూయెంజా వైరస్‌ శ్వాసనాళంపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు సంభవించే చాన్సు ఉందని పేర్కొంటున్నారు. ఇది సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.