Begin typing your search above and press return to search.

పోలీస్ ట్రైనింగ్ లో కోళ్లు పట్టడమూ నేర్పాలేమో

By:  Tupaki Desk   |   16 July 2015 10:09 AM GMT
పోలీస్ ట్రైనింగ్ లో కోళ్లు పట్టడమూ నేర్పాలేమో
X
ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లోని పోలీసులతో పోల్చితే మన రాష్ట్ర పోలీసుల పరిస్థితి ఎంతో నయం అనుకోవాలి. నార్తిండియాలోని పలు రాష్ట్రాల్లో పోలీసులకు అప్పగిస్తున్న పనులు చూస్తుంటే మనోళ్లను ఇక్కడ బాగానే చూసుకుంటున్నారని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు. కొద్ది రోజుల కిందట ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలిసిందే... యూపీ మంత్రి ఆజంఖాన్ గేదెలు మిస్సయితే వాటిని వెతకడానికి కానిస్టేబుళ్లు, ఎస్సైలే కాదు... సీఐలు కూడా గడ్డి మైదానాలన్నీ తిరిగారు. ఆ తరువాత సమాజ్ వాది పార్టీకి చెందిన ఇంకో నాయకుడి ఇంట్లో కోళ్లు ఎటో వెళ్లిపోయాయి.. వాటిని పట్టుకునే డ్యూటీ కూడా పోలీసులకే పడింది.

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులకూ అలాంటి అనుభవమే ఎదురైంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దాబ్రా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇమారతీ దేవికి చెందిన లాబ్రడార్‌ జాతి పెంపుడు కుక్క తప్పిపోయింది. దీంతో తీవ్ర విచారంలో మునిగిపోయిన ఎమ్మెల్యే కంటతడిపెట్టింది. ఆ కుక్కను త్వరగా పట్టుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇప్పుడు ఆ కుక్కను పట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.

చూడబోతే ఇకమీదట భారతదేశంలో పోలీసు ట్రైనింగులో కుక్కలు, మేకలు, కోళ్లు, ఆవులు పట్టుకోవడంలోనూ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.