Begin typing your search above and press return to search.

డీఎస్ః పులుసులో ముక్క‌!

By:  Tupaki Desk   |   1 Nov 2015 6:36 AM GMT
డీఎస్ః పులుసులో ముక్క‌!
X
పార్టీ మారక ముందు ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యం. హస్తాన్ని వీడి కారెక్కిన వెంటనే "బుగ్గ కారు"ఇచ్చారు. బంగారు తెలంగాణ కోసం ఆయనకు భారీ బాధ్యతలను అప్పగించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ప్రాధాన్యతను కుదించారు. ఆయనకు కేటాయించిన వ్యవహారాలను సైతం ఆయన లేకుండానే కానిచ్చేస్తున్నారు. కనీసం సమావేశాలకు సైతం ఆయనకు ఆహ్వానం అందటం లేదు.

డీ శ్రీనివాస్. ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తన ప్రాబల్యాన్ని కోల్పోయారు. పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే డీఎస్‌ కాంగ్రెస్ ను వీడి అధికార పార్టీ టీఆర్ ఎస్ లో చేరారు. ఆయన సీనియార్టీకి గుర్తుగా ప్రభుత్వ సలహదారుగా నియమించారు. అప్పటికే ఆరుగురు సలహాదారులున్నా...డీఎస్‌ సేవలను వినియోగించుకునేందుకు మరో సలహదారు పదవి అప్పగించి కేబినేట్‌ హోదాను సైతం కట్టబెట్టారు. మంత్రులకు ఇస్తున్నఅన్ని వసతులు ఆయనకు కల్పిస్తున్నారు. అత్యంత కీలకమైన అంతర్‌ రాష్ట్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో పలు చిక్కులు ఉన్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు ఆంద్ర ప్రదేశ్, మరో వైపు కర్ణాటకతో జల వివాదాలు నడుస్తున్నాయి. ఇలా ఎన్నో చిక్కు ముడులను విప్పే బాధ్యతను సీఎం కేసీఆర్ డీఎస్‌కు కట్టబెట్టారు. అంతర్రాష్ట వ్యవహరాల విషయంలో తన చతురతతో పరిష్కరించగలడన్ననమ్మకాన్ని ఉంచారు. తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని బాధ్య‌తలు స్వీకరించారు. బాధ్య‌తలు చేపట్టిందే తడువుగా పలు వర్గాలతో సచివాలయంలో చర్చలు సాగించారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు కట్టబెట్టిన అంశాల్లో కూడా ఆయనను ఆహ్వనించడం లేదు. ఈ మధ్య‌ మహరాష్ట ఇంజనీర్లతో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఇంజనీర్లు చర్చలు సాగించారు. అయితే అంతర్‌ రాష్ట్ర సంబంధాల్లో ప్రభుత్వ సలహదారులుగా ఉన్నడీఎస్ మాత్రం సమావేశంలో లేరు.

ఇక ఏపీ నూతన రాజదాని అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ తన వెంట మంత్రులు ఈట‌ల - మహమూద్ అలీ - జగదీష్ రెడ్డిని తీసుకెళ్లారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంతర్‌ రాష్ట సంబంధాల సలహదారుడిగా ఉన్న డీఎస్‌ కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. అంతకు ముందు చంద్రబాబు కేసీఆర్ ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా డీఎస్ కు సమాచారం ఇవ్వలేదు. ఇక చత్తీస్ ఘడ్ తో కుదిరిన విద్యుత్ ఒప్పందాల సమయంలో కూడా డీఎస్ కు ప్రాధాన్యత దక్కలేదు. మరో వైపు కేరళా సీఎం ఊమెన్ చాండీ రాష్టంలో పర్యటించారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేసీఆర్ ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా డీఎస్ సీన్లో లేరు.

ఏపీతో ఉన్నస‌మ‌స్య‌ల పరిష్కారం కోసం అడపాదడపా కేసీఆర్ ఉమ్మడి రాష్ట గవర్నర్ ను కలుస్తున్నారు. గవర్నర్ తో చర్చించేది అంతర్‌ రాష్ట వివాదాలైప్పటికీ డీఎస్ ను వెంట‌ తీసుకెళ్లట్లేదు. మ‌రోవైపు సీఎం ఢిల్లీ పర్యటన బృందంలో కూడా డీఎస్ ఎక్క‌డా ఫ్రేంలో లేరు. ఇలా పలు కీలక అంశాల్లో డీఎస్ కనబడకపోవడం చూస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకు ప్రధాన్యత ఎంత మేర లభిస్తుందో తేటతెల్లమవుతుంది. ఈ ప‌రిణామాల‌న్నింటి చూస్తుంటే టీఆర్ఎస్‌లో చేర‌డం ద్వారా పులుసులో ముక్క‌గా మారిపోయారా? అనే సందేహం ఇపుడు కాంగ్రెస్‌-టీఆర్ఎస్ శ్రేణుల మ‌ధ్య జోరుగా సాగుతోంది.