Begin typing your search above and press return to search.

CSKvsRCB: వీక్షకుల సంఖ్యలో కొత్త రికార్డు

By:  Tupaki Desk   |   18 April 2023 4:00 PM GMT
CSKvsRCB: వీక్షకుల సంఖ్యలో కొత్త రికార్డు
X
దేశంలోనే వారిద్దరూ టాప్ క్రికెటర్లు.. ఇండియాకు రెండు ప్రపంచకప్ లు అందించి ఆరాధ్య క్రికెటర్ అయిన ఎంఎస్ ధోని ఒకవైపు.. భారత క్రికెట్ లో సెంచరీల మోత మోగించి ఆల్ టైం హ్యయెస్ట్ స్కోరర్ గా ఉంటున్న విరాట్ కోహ్లీ మరో వైపు. ఈ ఇద్దరు దిగ్గజాల నడుమ ఐపీఎల్ ఫైట్ జరిగింది. ఇక ప్రేక్షకులు, దేశంలోని క్రీడాభిమానులు టీవీలకు అతుక్కుపోకుండా ఎలా ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జియో సినిమాలో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించింది. ఈ మ్యాచ్ ను ఏకంగా 2.4 కోట్ల మంది వీక్షకులు చూడడం ఓ రికార్డు. అన్ని రికార్డులను ఈ మ్యాచ్ బద్దలు కొట్టింది.

డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83), శివమ్ దూబే (27 బంతుల్లో 52) అర్ధశతకాలు బాది చెన్నై స్కోరు 226/6కు చేర్చారు. బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఈ ఐపీఎల్ 2023 24వ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో బెంగళూరు పై చెన్నై గెలిచింది. గ్లెన్ మాక్స్‌వెల్ (36 బంతుల్లో 76) , ఫాఫ్ డు ప్లెసిస్ (33 బంతుల్లో 62) మెరుపులు మెరిపించినా కొండంత లక్ష్యం కావడంతో బెంగళూరు అందుకోలేకపోయింది. చివర్లో సీఎస్కే బౌలర్లు బాగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో చెన్నై గెలిచింది.

మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మ్యాచ్ చూస్తున్న వీక్షకుల సంఖ్య 2.4 కోట్లకు చేరుకుంది. జియో సినిమా యాప్ పై ఇప్పటివరకూ ఇదే అత్యధికం కావడం వివేషం. దేశంలోని ప్రజలందరికీ ఈసారి ఉచిత ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నారు. అందుకే ఇంతటి భారీ రెస్పాన్స్ వచ్చిందని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఒక ప్రకటనలో తెలిపింది.

"ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉన్నప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ లో చూసిన వీక్షకుల సంఖ్య కంటే జియో సినిమాలో చూస్తున్న సంఖ్యలు చాలా పెద్దవిగా ఉన్నాయి. జియో సినిమాలో ప్రారంభ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గతంలో జరిగిన ఫైనల్ ఎన్‌కౌంటర్ల కంటే చాలా మెరుగ్గా వ్యూయర్ షిప్ ఉండడం విశేషం. ఉచిత ప్రసారాల వల్లే అందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూయర్ షిప్ లో ప్రతిరోజూ కొత్త బెంచ్‌మార్క్‌లను ఈ యాప్ సెట్ చేస్తోంది.

ఐపీఎల్ ప్రసారాలతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ కొత్త వీక్షకులను జియో సినిమా యాప్ సంపాదిస్తోంది. 2019 సీజన్ చివరి మ్యాచ్‌లో డిస్నీ హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షకుల సంఖ్య 1.86 కోట్లుగా నమోదైంది. ఇప్పుడు దాన్ని ఈజీగా జియో సినిమా బద్దలు కొట్టింది.

ముఖ్యంగా, భారతదేశంలోని వీక్షకులందరికీ ఐపీఎల్ 2023ని జియో సినిమా ఉచితంగా ప్రసారం చేయడం వలన ఈ రికార్డు స్థాయిలో వీక్షణలు వచ్చాయి. ఈ జియో సినిమా యాప్ ప్రస్తుతం ఇన్‌స్టాల్ చేసిన ఏవైనా యాప్‌లలో అత్యధిక సంఖ్యను నమోదు చేయడం గమనార్హం.