Begin typing your search above and press return to search.

బిట్‌కాయిన్ షాక్‌...పాస్‌వ‌ర్డ్ లేదు..వెయ్యికోట్లు గాయ‌బ్‌

By:  Tupaki Desk   |   6 Feb 2019 6:09 PM GMT
బిట్‌కాయిన్ షాక్‌...పాస్‌వ‌ర్డ్ లేదు..వెయ్యికోట్లు గాయ‌బ్‌
X
క్రిప్టోక‌రెన్సీ బిట్ కాయిన్ విష‌యంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కెన‌డాకు చెందిన క్రిప్టో క‌రెన్సీ ప్లాట్‌ఫామ్ క్వాడ్రిగా సైట్‌ను న‌డిపే వ్య‌క్తి గెరాల్డ్ కొటెన్ ఇటీవ‌ల భార‌త్‌లో మృతిచెందాడు. అయితే క్వాడ్రిగా క్రిప్టో సైట్లో సుమారు వెయ్యి కోట్లు(137 మిలియ‌న్ డాల‌ర్లు) ఫ్రీజ్ అయ్యాయి. గెరాల్డ్ కంప్యూట‌ర్ పాస్‌వ‌ర్డ్ తెలియ‌క‌పోవ‌డంతో.. ఆ సైట్‌లో ట్రేడింగ్ నిలిచిపోయింది. వేలాది మంది క‌స్ట‌మ‌ర్లు ఇప్పుడు ల‌బోదిబోమంటున్నారు.

గెరాల్డ్ న‌డిపించే క్వాడ్రిగా ప్లాట్‌ఫామ్ ఆధారంగా.. కెన‌డాలో బిట్‌కాయిన్‌, లైట్‌కాయిన్‌, ఎథీరియ‌మ్ లాంటి క్రిప్టో ట్రేడింగ్ జ‌రుగుతుంది. క్వాడ్రిగాలో సుమారు 3.6 ల‌క్ష‌ల రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్లు ఉన్నారు. గెరాల్డ్ కంప్యూట‌ర్‌లో ఉన్న కోల్డ్ వ్యాలెట్‌లో సుమారు వెయ్యి కోట్లు ఉన్నాయి. కాగా, ఇటీవ‌ల ఇండియాలోని ఓ అనాథ‌శ్ర‌మాన్ని విజిట్ చేసిన గెరాల్డ్‌.. రాజస్థాన్‌లో అక‌స్మాత్తుగా మృతిచెందాడు. క్రోన్స్ వ్యాధితో అత‌ను ప్రాణాలు విడిచాడు. భార‌త ప్ర‌భుత్వం కూడా అతని మృతికి సంబంధించిన డెత్ స‌ర్టిఫికెట్‌ను రిలీజ్ చేసింది.

అయితే, గెరాల్డ్ న‌డిపించే సొమ్మును ఆన్‌లైన్ ద్వారా యాక్సెస్ చేయ‌డం సాధ్యం కావ‌డం లేదు. ఇందుకు కార‌ణం పాస్‌వ‌ర్డ్ తెలియ‌క‌పోవ‌డం. అయితే, గెరాల్డ్ మృతి కార‌ణంగా, ఆ కంప్యూట‌ర్‌ను ఫిజిక‌ల్‌గా కూడా యాక్సెస్ చేయ‌లేక‌పోతున్నారు. దీంతో ఆ కంప్యూట‌ర్ పాస్‌వ‌ర్డ్ లేక‌.. సుమారు వెయ్యి కోట్లు నిరుప‌యోగంగా ప‌డి ఉన్నాయి. అయితే చ‌నిపోవ‌డానికి 12 రోజుల ముందు భార్య పేరు మీద వీలునామా రాశాడు. ఆయ‌న స‌తీమ‌ణి సైతం పాస్‌వ‌ర్డ్ చెప్ప‌లేక‌పోతుండ‌టంతో....వెయ్యికోట్ల మ‌దుపుదారులకు ఏడుపు ఒక‌టే మిగిలింది.