Begin typing your search above and press return to search.

కడపలో కీలకమైన సమావేశం

By:  Tupaki Desk   |   18 April 2023 10:17 AM GMT
కడపలో కీలకమైన సమావేశం
X
చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కడపలో మంగళవారం కీలకమైన సమావేశం జరగబోతోంది. కడపలోని ముస్లిం ప్రముఖులతో పాటు మరికొందరికి పార్టీ తరపున చంద్రబాబు ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నారు. ఇదే సమయంలో జిల్లాలోని సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు. జోన్-5 పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని నేతలందరు సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గాలకు అభ్యర్దులుగా ప్రకటించిన నేతలతో పాటు ఇన్చార్జిలు, మండలస్ధాయి నేతలు కూడా హాజరవుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో అత్యధిక సీట్లను గెలుచుకోవటమే టార్గెట్ గా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మెజారిటి సీట్లను గెలుచుకోవటం ఎలాగో అర్ధంకావటంలేదు.

ఎందుకంటే పార్టీ పెట్టినదగ్గర నుండి ఇప్పటివరకు జిల్లాలో టీడీపీ మెజారిటి సీట్లు ఎప్పుడూ గెలవలేదు. చివరి రెండు ఎన్నికల్లో అయితే పార్టీ పరిస్ధితి మరీ అన్యాయమైపోయింది. ఈ నేపధ్యంలోనే పార్టీ మెజారిటి సీట్లు గెలవాలంటే మార్గాలేమిటి అనే విషయమై చర్చించేందుకు ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు.

ఇక్కడ ఒకచిన్న విషయం ఏమిటంటే ఈమధ్యనే జరిగిన పట్టభద్రుల ఎంఎల్సీ స్ధానంలో టీడీపీ నేత భూమిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలిచారు. నిజానికి ఈ గెలుపును టీడీపీ ఊహించలేదు. భూమిరెడ్డి పులివెందులకే చెందిన నేత. దాంతో చంద్రబాబుతో పాటు పార్టీలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది. పులివెందుల నేత పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో గెలవమంటే మామూలు విషయం కాదు. అందుకనే అప్పటినుండి చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. పార్టీ నేతలను కూడా పదేపదే కలుస్తున్నారు.

ఎంఎల్సీ ఎన్నికల్లో విజయంతో జనాల్లో వైసీపీ అంటే వ్యతిరేకత మొదలైందని చంద్రబాబు అనుకుంటున్నారు. దీన్ని వచ్చేఎన్నికల్లో ఎలాగైనా అడ్వాంటేజ్ గా తీసుకోవాలన్నదే చంద్రబాబు ప్లాన్. అయితే ఇప్పటివరకు పులివెందులలో బీటెక్ రవిని తప్ప ఇంకెవరినీ చంద్రబాబు అభ్యర్దులుగా ప్రకటించలేదు.

కాబట్టి అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించాలని తమ్ముళ్ళందరు గట్టిగా కోరుతున్నారు. ఈ నేపధ్యంలో అన్నీ నియోజకవర్గాలకు కాకపోయినా కనీసం కొన్నిచోట్లయినా అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. తొందరగా అభ్యర్ధులను ప్రకటిస్తే ప్రచారం చేసుకునేందుకు కావాల్సినంత సమయం ఉంటుందన్నదే తమ్ముళ్ళ ఆలోచన. మరి సమావేశంలో ఏమి చేస్తారో చూడాల్సిందే.