Begin typing your search above and press return to search.

కరోనా ఎక్కడికీ పోలేదు.. కనిపెట్టుకుని ఉండాల్సింది మనమే

By:  Tupaki Desk   |   25 Nov 2021 2:30 PM GMT
కరోనా ఎక్కడికీ పోలేదు.. కనిపెట్టుకుని ఉండాల్సింది మనమే
X
మొన్న విశ్వ నటుడు కమల్ హాసన్.. నిన్న డ్యాన్స్ మాస్టర్ శివశంకర్.. నేడు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. వరుసగా కరోనా బారినపడిన ప్రముఖులు వీరు. శివశంకర్ మాస్టర్ కుటుంబంలో భార్య పెద్దకొడుకు సైతం వైరస్ కు గురయ్యారు. శివశంకర్, కుమారుడి ఆరోగ్యం విషమంగా ఉంది. శివశంకర్ ఊపిరితిత్తులు 75 శాతం దెబ్బతిన్నాయి. దీన్నిబట్టి తెలుసుకోవాల్పింది ఏమంటే, కరోనా ఎక్కడకూ పోలేదని మన మధ్యనే చాపకింద నీరులా ఉన్నదని.

సామూహిక కార్యక్రమాల్లో జరభద్రం

సెకండ్ వేవ్ ముగిసి, కేసులు తగ్గుతుండడంతో ప్రస్తుతం సామూహిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వేలాదిమంది వివాహాలకు హాజరవుతున్నారు. అయితే, అందరూ జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదు. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలామంది భౌతిక దూరాన్ని కూడా మరిచారు.

ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఇంకా వివాహాలు శుభకార్యాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లోనే కొవిడ్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నిరుడు ఫస్ట్ వేవ్ ముగిశాక మహారాష్ట్ర్రలో వినాయక చవితి, దసరాకు జనం పెద్ద ఎత్తున గుమిగూడడంతో డెల్టా వేరియంట్ పుట్టుకొచ్చింది.

అది అనంతరం దేశంలో ఎంత పెద్ద విపత్తుకు దారితీసిందో అందరూ గమనించారు. కేవలం సెకండ్ వేవ్ లోనే మూడు లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇవి అధికారిక లెక్కలే. అనధికారికంగా చూస్తే పదిహేను లక్షల మంది వరకు చనిపోయినట్లు సమాచారం.

జాగ్రత్తలు పాటించండని కేంద్రం చెబుతున్నా..

కొవిడ్ పూర్తిగా సమసిపోలేదని జాగ్రత్తలు పాటించమని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ, జనమే పట్టించుకోవడం లేదు. కొందరు మాత్రమే (10 శాతం) మాస్క్లులు ధరిస్తున్నారని ఓ సంస్థ అధ్యయనంలో తేలింది. మరోవైపు శానిటైజర్ వినియోగమే మరిచారు. ఆఖరుకు పరీక్షలు కూడా తగ్గిపోతున్నాయి. దీనిని ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

ఆ పెళ్లిలో ప్రముఖులు

ఆదివారం జరిగిన పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలి వివాహంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వందల మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహం అనంతరమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అంతకుముందు పోచారం తెలులు రాష్ట్రాల సీఎంలకు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ప్రస్తుతం పోచారం నకు పాజిటివ్ రావడం ఎటు దారితీస్తుందో చూడాలి.