Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వచ్చినా భారత్ లో ఆ సమస్య తప్పదట

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:38 PM GMT
వ్యాక్సిన్ వచ్చినా భారత్ లో ఆ సమస్య తప్పదట
X
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రస్తుతం భారత్ మీద భారీగా చూపుతోంది. రోజు గడిచేసరికి తక్కువలో తక్కువ తొంభై వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చే ఏడాది వస్తుందన్న అంచనాలే నిజం కానున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు భారత్ కు తప్పదన్న మాటను చెబుతున్నారు. ప్రముఖ వైద్యులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు కమ్ వెల్లూరుకు చెందిన క్సిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అయిన గగన్ దీప్ తాజాగా ఒక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి దేశంలోని 130 కోట్ల మంది భారతీయులకు దాన్ని అందించటం పెను సవాలుగా స్పష్టంగా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్ల సమర్థత ఈ ఏడాది చివరికి తేలిపోతుందని.. మంచి ఫలితాలు వస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో కొన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయన్న అంచనాను వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కావాలంటే వచ్చే ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సిందేనని చెప్పిన ఆమె.. ప్రస్తుతం నడుస్తున్న మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన వ్యాక్సిన్లు విజయవంతం అయ్య అవకాశం యాభై శాతమేనని చెప్పారు. ప్రయోగాలు పూర్తి అయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాని నిల్వ.. పంపిణీ భారత్ లో సవాలుతో కూడుకున్నదని చెప్పారు. కరోనా కారణంగా ప్రమాదం పొంచి ఉన్న పెద్ద వయస్కులకు వ్యాక్సిన్ అందించే సరైన వ్యవస్థ లేదన్న ఆమె.. అందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటమే దేశం ముందున్న పెద్ద సవాలుగా అభివర్ణించారు. మరి.. ఆమె మాటల్ని మోడీ సర్కారు వింటుందా?