Begin typing your search above and press return to search.

తవ్వేకొద్దీ బయటకు 'సృష్టి' ఆస్పత్రి నిర్వాకాలు..బిడ్డ చనిపోయిందంటూ విక్రయం

By:  Tupaki Desk   |   7 Aug 2020 1:00 PM GMT
తవ్వేకొద్దీ బయటకు  సృష్టి ఆస్పత్రి నిర్వాకాలు..బిడ్డ చనిపోయిందంటూ విక్రయం
X
విశాఖ సృష్టి ఆస్పత్రి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమవడంతో వైద్యురాలితో పాటు మరో మహిళను అరెస్టు చేసినట్లు వైజాగ్ సీపీ ఆర్కే మీనా తెలిపారు. విశాఖ సృష్టి పెర్టిలిటీ సెంటర్ లో పిల్లలు లేని దంపతులకు సరోగసీ విధానంలో చికిత్స ఇస్తుంటారు. అయితే ఆ ఆస్పత్రిలో బిడ్డలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు రాగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో విస్తు పోయే అక్రమాలు బయటపడ్డాయి. ఈ కేసుపై వైజాగ్ సీపీ మాట్లాడుతూ సృష్టి, పద్మజ ఆస్పత్రులు కలసి శిశువులను విక్రయించినట్లు కీలక ఆధారాలు లభించినట్లు తెలిపారు.పద్మజ ఆస్పత్రిలోనూ రికార్డులు సరిగా లేవని చెప్పారు.

ఈ రెండు ఆస్పత్రులు కలసి మూడేళ్ళలో 63 అద్దె గర్భాల ద్వారా కాన్పులు జరిగాయని, ఇందులో సరోగసీ శిశువుల్లో నాలుగు అక్రమ విక్రయాలు గుర్తుంచినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇది వరకే ఆరుగురిని అరెస్టు చేయగా తాజాగా డాక్టర్ పద్మజ, నూకరత్నం అనే మహిళను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరికొన్ని శిశువుల అమ్మకాల పైనా కేసులు నమోదు చేశామని, కేసుకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. చోడవరంకు చెందిన గర్భిణి వెంకటలక్ష్మి కాన్పుకు రాగా సృష్టి, పద్మజ ఆస్పత్రుల వైద్యులు పురిట్లోనే పాప చనిపోయిందని నమ్మించారు.

పిల్లలు లేని దంపతులకు వారికే పాప పుట్టినట్లు సర్టిఫికెట్స్ ఇచ్చి రూ.13 లక్షలు వసూలు చేసుకున్నారు. అనుమానంతో వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయగా సృష్టి ఆస్పత్రిలో పిల్లల అమ్మకాలు జరుగుతున్నట్లు బయటపడింది. ఇలా ఒకటి రెండు కాదు ఏడాది కాలంలో ఇక్కడ 56 మంది జన్మించారు.లేని వాళ్లకు మాయ మాటలు చెప్పి పిల్లల్ని అమ్మించారనే ఆరోపణలు ఉన్నాయి. సృష్టి ఆస్పత్రికి విజయవాడ, హైదరాబాద్, భువనేశ్వర్, కోల్ కత్తా బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్రాంచులలో కూడా ఇలాంటి శిశు విక్రయాలు జరిగి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.