Begin typing your search above and press return to search.

సీబీఐ ఎదుట అవినాష్ : నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం

By:  Tupaki Desk   |   28 Jan 2023 8:16 PM GMT
సీబీఐ ఎదుట అవినాష్ : నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం
X
ఏపీలో అత్యంత కీలకమైన కేసుగా ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి సీబీఐ అనుమానితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ రోజు విచారించింది. ఏకంగా నాలుగు గంటల పాటు ఈ విచారణ సాగింది. పావు తక్కువ మూడు నుంచి మొదలైన విచారణ రాత్రి ఏడు వరకూ సాగింది విచారణను పూర్తి చేసుకుని బయటకు వచ్చిన అవినాష్ సీబీఐ బృందం అడిగిన ప్రశ్నలు అన్నింటికీ తనకు తెలిసిన సమాధానాలు ఇచ్చాను అని చెప్పారు.

వారి సందేహాలను తాను చాలా వరకూ నివృత్తి చేశాను అని చెప్పారు. తనను మరోసారి పిలుస్తామని అన్నారని, తాను తప్పకుండా సీబీఐ మళ్లీ పిలిచినా అటెండ్ అవుతాను అని ఆయన చెప్పారు. సీబీఐ బృందం విచారణకు తాను సహకరిస్తాను అని ఆయన చెప్పారు. కాగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తన మీద ఇప్పటికే విషం కక్కుతూ రాతలు రాస్తోందని, అందుకే తాను తాను సీబీఐ ఎదుట ఏమి చెప్పాను అన్న దాన్ని వీడియో ఆడియో రికార్డింగ్ చేయించాలని కోరాను అని అన్నారు. అలాగే తన తరఫున లాయర్ ని కూడా హాజరుకు అనుమతించాలని కోరానను అయితే సీబీఐ అందుకు అనుమతించలేదని ఆయన చెప్పారు.

తాను సీబీఐ విచారణలో అడిగిన వాటిని అన్నింటికీ చెప్పాను అని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా వివేకా హత్య అనంతరం జరిగిన పరిణామాల మీద ఎక్కువగా సీబీఐ ఆయన్ని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అలాగే అవినాష్ ఫోన్ కాల్స్ తో పాటు ఆయన ఆర్థిక లావాదేవీల మీద కూడా ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.

అవినాష్ ని విచారించడానికి డిల్లీ నుంచి ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీబీఐ బృందం హైదరాబాద్ వచ్చింది. ఇందులో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కోఠీలోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ విచారణ సాగింది. అవినాష్ రెడ్డి ని వరసబెట్టి విచారించి అరెస్ట్ కూడా చేస్తారు అని జోరుగా ప్రచారం సాగింది.

కడపకు చెందిన వైసీపీ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు అయితే ఈ కేసులో సంచలన విషయాలు తొందరలో బయటపడతాయని కూడా కామెంట్శ్ చేశారు. అదే విధంగా ఈ కేసులో కొంతమంది అప్రూవర్స్ గా మారారు కాబట్టి అన్ని ఆధారాలు సీబీఐ దగ్గర ఉన్నాయని దోషులు ఎవరైనా తొందరలో బయటకు వస్తారు అని కూడా చాలా మంది అనడం జరిగింది.

ఇక అవినాష్ రెడ్డి అయితే తన మీద ఒక వర్గం మీడియా కక్షకట్టిందని సీబీఐ విచారణ అనంతరం మీడియా ముందు హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసు విషయంలో వాస్తవాలు బయటకు రావాలని ఆయన కూడా అంటున్నారు. మొత్తానికి అవినాష్ రెడ్డి విచారణ అన్నది మాత్రం రాజకీయంగా సంచలనగానే ఉన్నా తొలి రోజున పెద్దగా హడావుడి అయితే కనిపించలేదు. మరోసారి పిలుస్తామని సీబీఐ చెప్పడంతో ఎపుడు సీబీఐ నుంచి పిలుపు వస్తుంది, అవినాష్ ఎపుడు వెళ్తారు ఆ రోజున ఏమి జరగనుంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.