Begin typing your search above and press return to search.

కాపునాడు అల్టిమేటం : బాలయ్యా... ఇదేమి గోలయ్యా... ?

By:  Tupaki Desk   |   25 Jan 2023 7:00 AM GMT
కాపునాడు అల్టిమేటం : బాలయ్యా... ఇదేమి గోలయ్యా... ?
X
నందమూరి బాలక్రిష్ణను జనాలు చాలా ఉన్నతంగా చూస్తారు. ఆయన నట శిఖరం ఎన్టీయార్ కుమారుడు. అంతే కాదు తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ సృష్టికర్త ఎన్టీయార్ కి రాజకీయ వారసుడు. నటుడిగా సీనియర్ అయిన బాలయ్య టాలీవుడ్ లో కీలక స్థానంలో ఉన్నారు. తానుగా ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. ఇక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాలయ్య ఉన్నారు.

వీటితో పాటు మాజీ సీఎం చంద్రబాబు వియ్యకుడు. తెలుగుదేశం పార్టీకి నందమూరి ఫ్యామిలీ నుంచి కంచుకోటలా ఉన్నారు. అలాంటి బాలయ్య తన నోటి వెంట మాటలను చాలా ఈజీగా వదిలేస్తారు. బాలయ్యను దగ్గర నుంచి చూసిన వారికి కానీ ఆయన్ని ఎరిగిన వారికి కానీ ఆ మాటలలో సీరియస్ నెస్ ఉండదని తెలుసు. కానీ ఆయన అంటున్న మాటలు మాత్రం దూరంగా చూసిన వారికి మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి.

అయినా సరే బాలయ్య తన స్టైల్ ఆఫ్ స్పీచెస్ మార్చుకోరు. ఆయన మైక్ పట్టుకుంటే తోచిన విధంగా మాట్లాడేస్తారు అని అంటారు. బాలయ్య మనసులో ఏమీ ఉండి అనరు కానీ ఆయన మాటలు మాత్రం గుండెల్లో గునపాలుగా గుచ్చేస్తాయని అంటారు. లేటెస్ట్ గా వీర సింహారెడ్డి చిత్రం విజయోత్సవంలో బాలయ్య స్పీచ్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో ఆయన అన్న ఒకే ఒక మాట ఇపుడు టాలీవుడ్ నే కాదు, ఏపీ రాజకీయాలనే మంట పెట్టేలా ఉంది.

ఆయన ఒక నటుడితో తన షూటింగ్ అనుభవాల గురించి చెబుతూ నోరు జారేశారు. ఆ రంగా రావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చాలా ఈజీగా నోటి వెంట వదిలిన డైలాగులు ఇపుడు సినీ రాజకీయ రంగాలలో చిచ్చు పెడుతున్నాయి. అక్కినేని తొక్కినేని అన్న సందర్భం చూస్తే ఆ రోజే అక్కినేని వర్ధంతి. కనీసం నివాళి అర్పించకపోయినా పర్వాలేదు, కానీ కించపరచేలా మాట్లాడడమేంటి అన్నదే అందరి మాట.

అయితే బాలయ్య ఫ్లోలో ఇలా మాట్లాడారు అని అంటున్నారు. కానీ చేసింది తప్పు. ఇక ఆ రంగారావు ఈ రంగారావు అని అంటారా అంటూ కాపునాడు నేతలు బాలయ్య మీద రగిలిపోతున్నారు. వారు ఏకంగా బాలయ్యకు అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 25వ తేదీలోగా బాలయ్య తాను రంగావావు మీద అన్న మాటలకు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పకపోతే ఏపీవ్యాప్తంగా వంగవీటి రంగా విగ్రహాల ముందు మౌన దీక్ష చేపడతామని, అదే విధంగా లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ఒక ప్రధాన శక్తిగా ఉంది. వారి ఓట్ల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నానా రకాలైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అలాంటిది ఏమీ కాకుండా బాలయ్య ఎస్వీ రంగారావు మీద వాడిన డైలాగులు ఆ సామాజికవర్గాన్ని కించపరచేలా ఉన్నాయని వారు ద్వజమెత్తుతున్నారు. ఈ దెబ్బతో వారు తెలుగుదేశం పార్టీ మీదనే శరసంధానం చేస్తున్నారు. ఇక చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటూ అప్పట్లో బాలయ్య చేసిన కామెంట్స్. పవన్ సభలకు వచ్చే వారు అలగా జనాలు అంటూ చేసిన మరో కామెంట్ ని కూడా గుర్తు చేసుకుంటూ ఇపుడు బాలయ్య మీద మండిపడుతున్నారు.

ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ బిత్తరపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మెల్లగా పాత గాయాలను పాచప్ చేసుకుంటూ అన్ని వర్గాలకు చేరువ అవుతున్న తెలుగుదేశానికి బాలయ్య మాటల బాంబులు మంట పుట్టిస్తున్నాయని అంటున్నారు. లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న వేళ ఏపీలో రాజకీయం అంతా సామాజిక సమీకరణల మీద ఆధారపడిన వేళ బాలయ్య వంటి వారు ఇలా ఏమీ ఆలోచన లేకుండా మాట్లాడడం తగునా అని తెలుగుదేశం వారు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది అంటున్నారు.

మొత్తానికి చూస్తే బాలయ్య తన దైన శైలిలో మాట్లాడేతూ వేదిక మీద ఇస్తున్న స్పీచులు తెలుగుదేశానికి శిరోభారంగా మారుతున్నాయని అంటున్నారు. ఇపుడున్న క్లిష్ట పరిస్థితుల్లో బాలయ్య కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి చిత్తం వచ్చిన తీరున వ్యవహరిస్తే అల్టిమేట్ గా నష్టపోయేది తెలుగుదేశం కూడా అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా, ఎన్టీయార్ నట వారసుడిగా బాలయ్య తన హోదాను కూడా కాపాకునేలా వ్యవహరిస్తే బాగుంటుంది అని సూచనలు అందుతున్నాయి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.