Begin typing your search above and press return to search.

కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న ‘బలగం’ విలేజ్ స్క్రీనింగ్‌లు.. !

By:  Tupaki Desk   |   2 April 2023 3:40 PM GMT
కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న ‘బలగం’ విలేజ్ స్క్రీనింగ్‌లు.. !
X
తెలంగాణ యాసకు, భాషకు నిలువెత్తు కీర్తి లభిస్తోంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలోని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాయి. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బలగం నుంచి నేటి దసరా వరకూ టాలీవుడ్ ను తెలంగాణ నేపథ్య సినిమాలు ఏలుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విడుదలైన నెల దాటినా కూడా తెలంగాణలో బలగం మూవీ క్రేజ్ తగ్గడం లేదు. థియేటర్లు, ఓటీటీల్లో నడుస్తున్నా కూడా ప్రతీ గ్రామంలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మరీ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

'బలగం" ఇటీవల మంచి ఆదరణ పొందుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రదర్శింపబడుతూ కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. ఈ చిత్రం కుటుంబ సంబంధాలు, మానవీయ విలువలు , నైతికతలను హైలైట్ చేస్తుంది. గ్రామంలోని వ్యవహారాలు.. గ్రామ పెద్దల మద్దతుతో సాగుతుంది. గత కొద్ది రోజులుగా పూర్వ కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలలో సర్పంచ్ లు ముందుండి "బలగం" సినిమాను గ్రామస్థుల కోసం ప్రదర్శింప చేస్తున్నారు. పెద్ద స్క్రీన్లను తీసుకొచ్చి మరీ గ్రామస్థులకు ఉచితంగా చూపిస్తున్నారు.

తాజాగా రాజన్న-సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమళ్లలో ఉగాది పండుగ సందర్భంగా తొలి స్క్రీనింగ్ జరిగింది. అనంతరం కాసారం, ఉప్పరమల్యాల్‌, వెంకట్‌రావుపేట, జగ్గసాగర్‌, మెట్‌పల్లి మండలం తదితర గ్రామాల్లో ప్రదర్శించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సినిమాలను ప్రదర్శించడం గతంలో ఒకప్పుడు జరిగింది. టీవీలు వచ్చాక బాగా తగ్గిపోయింది. అయితే "బలగం" ఈ పాత పద్ధతిని పునరుద్ధరిస్తోంది. సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ప్రొజెక్టర్ల ద్వారా ఇలాడాక్యుమెంటరీలను ప్రదర్శించేవారు. వాటి స్థానంలో బలగం సినిమా ఇప్పుడు ఊరూరా ప్రజలకు స్క్రీన్ల ద్వారా ప్రదర్శిస్తున్నారు.

దర్శకుడు వేణు యెల్దండి.. ఈ సినిమా ద్వారా మనుషుల మధ్యన చెదిరిపోయే సంబంధాలు, కనుమరుగవుతున్న మానవీయ విలువల గురించి గొప్పగా చెప్పాడు. దీన్ని ప్రజలకు వివరించే లక్ష్యంలో సక్సెస్ అయ్యాడు.

"బలగం" ప్రదర్శనలు కావాలని గ్రామస్తులే డిమాండ్ చేస్తుండడంతో సర్పంచ్ లు వీటిని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో ఈ సినిమా ను చూడాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇలా గ్రామాల్లో సినిమా చూపిస్తూ గ్రామస్థులకు వినోదాన్ని పంచే ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.

కరీంనగర్‌తో పాటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో కూడా ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. థియేటర్లు అందుబాటులో లేని చోట్ల ఇలాంటి విలేజ్ స్క్రీనింగ్‌లు ప్రేక్షకులను సినిమాలకు దగ్గర చేస్తాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.